మచ్చచిచ్చు
మచ్చచిచ్చు
Published Thu, Apr 20 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
సాగునీటి కష్టాలకు ఎదురీదారు. బ్యాంకుల నుంచి రుణాలు అందకపోయినా.. పెద్దనోట్ల రద్దు కుంగదీసినా వరిసాగు చేశారు. పంట చేతికందుతున్న సమయంలోనూ రైతులను కష్టాలు వీడటం లేదు. ఎంటీయూ–1156 రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని మిల్లర్లు చేతులెత్తేయడంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
పాలకోడేరు : కాయకష్టం చేసి వరి పండించిన రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. ఎంటీయూ–1156 ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. దాళ్వాలో డెల్టా ఆయకట్టులోని 56 వేల హెక్టార్లలో 1156 వరి సాగు చేయగా.. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. అయితే, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్ల ర్లు ముందుకు రావటం లేదు. ఈ ధాన్యం తల భాగంలో చిన్నపాటి నల్ల మచ్చ వస్తోందని చెబుతున్నారు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ నిరాకరిస్తున్నందు వల్ల కొనేది లేదని తెగేసి చెబుతున్నారు.
ఏ–గ్రేడ్ రకమని చెప్పడంతో..
ఎంటీయూ–1010, ఎంటీయూ–1081 రకాలను సంకరపర్చి వ్యవసాయ
శాస్త్రవేత్తలు ఎంటీయూ–1156 వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. సాగు కోసం రైతులకు మినీ కిట్లు ఇచ్చి.. దానిపైనా పరిశోధనలు జరిపి ఈ రకాన్ని ఏ గ్రేడ్ రకంగా గుర్తించారు. గత ఏడాది అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంతో 2016 జూన్ లో ప్రభుత్వం ఈ పంటకు గుర్తింపునిచ్చింది. దీంతో డెల్టాలో 60 శాతానికి పైగా రైతులు ఈ వంగడాన్ని సాగు చేశారు. మాసూళ్లు మొదలైన తరుణంలో ఈ ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఐకేపీ కేంద్రాలైనా కొనుగోలు చేస్తాయనుకుంటే.. వాటికి లింకింగ్ వ్యవస్థగా రైస్‌మిల్లర్లే వ్యవహరిస్తున్నారు. రైస్ మిల్లర్లు ఆ ధాన్యాన్ని వద్దంటే తాము చేయగలిగిందేమీ లేదని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం మొహం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
తెస్తే కొంటాం కానీ..
ఎంటీయూ–1156 రకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయని విషయమై ఏపీఎం మురళీకృష్ణను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఆ రకం ధాన్యాన్ని రైతులెవరూ ఐకేపీ కేంద్రాలకు తీసుకు రాలేదన్నారు. నేరుగా ఐకేపీ కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాలకు, మిల్లర్లకు లింక్ ఉంటుంది కాబట్టి కొనుగోలు విషయంలో కొంత సందిగ్ధత నెలకొందని అన్నారు.
ఇది ఏ–గ్రేడ్ రకం
ఎంటీయూ–1156 వరి ధాన్యాన్ని ఏ–గ్రేడ్‌గా ధ్రువీకరించారని మండల వ్యవసాయ అధికారి సీహెచ్ జయవాసుకి తెలిపారు. 1010, 1081 రకాలను సంకరపర్చి శాస్త్రవేత్తలు ఈ కొత్త వంగడాన్ని రూపొందించారన్నారు. ధాన్యం మధ్యలో కొద్దిగా మచ్చ ఏర్పడిందని ఆమె తెలిపారు.
మూడెకరాల్లో సాగు చేశా..అధిక దిగుబడి వస్తుందని 1156 రకాన్ని మూడెకరాల్లో సాగు చేశాను. ఎకరానికి 50 బస్తాలపైనే దిగుబడి వచ్చింది. ఈ ధాన్యం కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. – మాదాసు వెంకటేష్, కౌలు రైతు, మోగల్లు
తక్కువ ధర ఇస్తామంటున్నారు..రెండెకరాల్లో 1156 రకాన్ని సాగు చేశాను. అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టాను. పంట అమ్ముదామంటే తీసుకోవడానికి ఎవరూ రావడం లేదు. ఏదోరకంగా అమ్ముదామంటే తక్కువ ధర ఇస్తామంటున్నారు. అప్పులు తీర్చేదెలాగో అర్థం కావట్లేదు.– కోనాల ప్రకాష్, కౌలురైతు, మోగల్లు
మా దృష్టికి రాలేదు..ఎంటీయూ–1156 వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. ఐకేపీ కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువస్తే కొనుగోలు చేస్తాం. మిల్లర్లు కొనకపోతే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి–కె.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ, ఏలూరు
Advertisement