గుంటూరు జీజీహెచ్‌లో 'మ్యాడ్ కౌ' కలకలం | Mad cow' case in GGH | Sakshi
Sakshi News home page

గుంటూరు జీజీహెచ్‌లో 'మ్యాడ్ కౌ' కలకలం

Published Tue, Apr 19 2016 8:26 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Mad cow' case in GGH

- మందులు, వైద్యం అందుబాటులో లేని వ్యాధి
- లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మహిళ
- వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్న వైద్యులు
 
గుంటూరు : యూరప్ దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన వ్యాధి 'మ్యాడ్‌ కౌ'. ఈ వ్యాధి లక్షణాలున్న మహిళ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఉన్న విషయం మంగళవారం కలకలం రేకెత్తించింది. ఈ వ్యాధికి వైద్యంగానీ, నియంత్రణకు మందులు గానీ అందుబాటులో లేకపోవటంతో వైద్యులు ఆమెను వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడాదికాలంలో ఇలాంటివి నాలుగు కేసులు నమోదవటంతో న్యూరాలజీ వైద్యులు ఆ రోగిపై పరిశోధన చేస్తున్నారు. 
 
ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం రంగారావుపేటకు చెందిన దాసరి రత్నకుమారి ఏడాది నుంచి అనారోగ్యంతో  ఉంటుంది. ఈ నెల 5న ఆమెను తల్లి కృపమ్మ చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చింది. న్యూరాలజీ వైద్యులు పరీక్షించి 'మ్యాడ్‌ కౌ' అనే అరుదైన వ్యాధి సోకినట్లు భావించి వార్డులో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మంగళవారం న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి ఈ అరుదైన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. 
 
గతంలో గుంటూరుకు చెందిన ఒక మహిళ ఈ వ్యాధితో జీజీహెచ్‌లో చేరి చనిపోయిందన్నారు. మరొకరు గతంలో ఇదే వ్యాధితో చేరి కొన్ని రోజులకు వెళ్లిపోయారని వివరించారు. తాజాగా మంగళవారం మరో వ్యక్తి ఇదే వ్యాధితో జీజీహెచ్‌లో చేరాడని వివరించారు. ఈ వ్యాధి సోకినవారు రెండేళ్ల వ్యవధిలో చనిపోతారని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో ఈ వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు ఎక్కడా లేకపోవటం వల్ల, కేవలం లక్షణాలను బట్టి వ్యాధి సోకినట్లు నిర్ధారించామన్నారు. ఈ వ్యాధి ఇంట్లో ఒకరికి ఉంటే వారి నుంచి మరొకరికి వ్యాప్తించటం లేదా జన్యుపరమైన కారణాల వల్ల లేదా ఒక్కోసారి ఎలాంటి కారణాలు లేకుండా కూడా రావచ్చని చెప్పారు. 
 
గొడ్డు మాంసం( బీఫ్) తినేవాళ్లలో ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాధి సోకిన మనిషి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారని, మతి మరుపు ఉంటుందని, నడవలేకపోవటం, చేతుల్లో నుంచి వస్తువులు ఊరికే జారి కిందపడిపోతాయని తెలిపారు. ఇది చాలా భయంకరమైన వ్యాధి అని, ఈ వ్యాధికి ఇప్పటి వరకు చికిత్స కనుగొనలేదని, నివారణ, నియంత్రణ పద్ధతులు ఏమీ లేవని చెప్పారు. కనీసం ఉపశమనం కోసం మందులు కూడా లేవని, ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెప్పారు. 
 
ఈ వ్యాధిని 1920లో డాక్టర్ జాకబ్ తరువాత ఆయన శిష్యుడు క్రూడ్జ్‌ఫెల్డ్ కనుగొన్నారని, వారి పేరుమీదుగా ఈ వ్యాధిని వైద్య పరిభాషలో 'క్రుడ్జ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్' అంటారని చెప్పారు. వెన్నుపూసలో నుంచి నీరు తీసి, బ్రెయిన్‌కు బయాప్సీ పరీక్ష చేసి కొంతమేరకు వ్యాధిని నిర్ధారించవచ్చని, ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. వ్యాధి లక్షణాలు గుర్తించడంతోపాటు, ఎంఆర్‌ఐ పరీక్ష ద్వారా కూడా కొంతమేరకు నిర్ధారణ చేసుకున్నామన్నారు. ఢిల్లీ, ముంబై పట్టణాల్లో మ్యాడ్‌ కౌ వ్యాధికి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement