– హాజరు కానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
– రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే...
– జిల్లా ఎస్పీని కలిసి అనుమతి కోరిన వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు
- ఉరవకొండలో ధర్నా స్థలం పరిశీలన
అనంతపురం సెంట్రల్ / ఉరవకొండ : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీన ఉరవకొండలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం వారితో పాటు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి సీపీ వీరన్న తదితరులు జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబును కలిసి ధర్నాకు అనుమతి కోరారు. ఈ సందర్భంగానూ, ఉరవకొండలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతోనూ వారు మాట్లాడారు.
హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో ప్రతిపాదిత ఆయకట్టు 3.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు నీరందించాలన్నారు. ఉరవకొండ పట్టణంలో అర్హులైన పేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చి..పక్కా గృహలు నిర్మించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవాకు 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండానే వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టారన్నారు. ఆయన కృషి ఫలితంగానే జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు.
ప్రతియేటా కృష్ణా జలాలు వస్తున్నా ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే హంద్రీ-నీవా ఆయకట్టు కింద ఉన్న మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరు అందించకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడటానికి తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారన్నారు.
ఈ ధర్నాకు ప్రజలు, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సభలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, ఉరవకొండలోనూ భారీఎత్తున ధర్నా జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతులకు హక్కుగా అందాల్సిన నీటిని సాధించడానికి వైఎస్ జగన్ ఉరవకొండలో ధర్నా తలపెట్టడం గొప్పవిషయమన్నారు.
ధర్నా స్థలం పరిశీలన
ఫిబ్రవరి 6న ఉరవకొండలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన మహా ధర్నాకు అనువైన స్థలాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పరిశీలించారు. గుంతకల్లు డీఎస్పీ రవికుమార్, ఉరవకొండ సీఐ సూర్యనారాయణతో కలిసి క్లాక్‌టవర్, పాత బస్టాండ్, ఎస్కే ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం, గవిమఠం ప్రాంగణంలోని స్థలాలను చూశారు. మహాధర్నాకు వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు.
6న ఉరవకొండలో మహాధర్నా
Published Tue, Jan 31 2017 11:36 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
Advertisement
Advertisement