బంగారు తెలంగాణకు ఎంపీపీలే కీలకం
♦ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
♦ సమస్యలను ఏకరువు పెట్టిన ఎంపీపీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బంగారు తెలంగాణ సాధనలో ఎంపీపీలదే కీలక భూమిక అని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఎంపీపీల సమస్యల పరిష్కారంలో సానుకూలంగా వ్యవహరిస్తామని చెప్పారు. సోమవారం జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఎంపీపీలు నిరంజన్‌రెడ్డి, సాయిలుగౌడ్, తీగల విక్రమ్‌రెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీపీలు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామాల పర్యటనలకు వాహన భ త్యం సమకూర్చాలని, మండలాలకు గత ప్రభుత్వం తగ్గించిన బదలాయింపు సుంకాన్ని పునరుద్ధరించాలని కోరారు.
బీఆర్‌జీఎఫ్ పథకం రద్దు చేయడంతో మండల పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడిందని, 13, 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా నిలిపివే యడంతో మండల పరిషత్‌ల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. జిల్లా మంత్రి కోటా నుంచి ప్రతి మండలానికి రూ.కోటి నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీపీల సమస్యలను ఆలకించిన మంత్రి.. జడ్పీ సీఈఓ రమణారెడ్డితో చర్చించారు. కేసీఆర్ ప్రభుత్వం మునుపెన్నడులేని విధంగా ఎంపీపీల వేతనాలు పెంచిందని, స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల సర్కారు గౌరవంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.