అంకురార్పణ
మల్లన్న సనిధిలో మకరసంక్రమణ మహోత్సవాలు
· శాస్త్రోక్తంగా ఉత్సవపూజలకు అంకురార్పణ
· సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ
· నేటి నుంచి వాహనసేవలు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మకరసంక్రమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణం రుద్ర యాగశాలలో పంచాహ్నికదీక్షతో ఆరంభమైన ఈ ఉత్సవాల్లో దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌గుప్త, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, కంకణ«పూజలు నిర్వహించారు. యాగశాలలో లోక కల్యాణం కోసం జరిగిన ఈ విశేషపూజల సందర్భంగా చండీశ్వరుడికి కంకణధారణ చేశారు. ఉత్సవాలో్ల పాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయసిబ్బందికి దీక్షావస్త్రాలను ఈఓ అందజేశారు. ఆ తరువాత వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, పంచావరణార్చన, కలశస్థాపన నిర్వహించి అనుష్ఠానములు చేశారు. రాత్రి 8 గంటల నుంచి భేరిపూజ, భేరితాడన తో సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజ పటావిష్కరణ ః
మకర సంక్రమణ మహోత్సవాలో్ల భాగంగా బుధవారం రాత్రి 8.15గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు. దీనికి ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు పూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. పార్వతీమల్లికార్జునస్వామివార్ల కల్యాణంలో కన్యాదానం చేసేందుకు శ్రీ మహావిష్ణువును ఉత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్చారణలతో ఆహ్వానం పలికారు. పంచాహ్నికదీక్షతో వారం రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.