అశిమానంద (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానందకు హర్యానాలోని పంచకుల న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులోనూ ఇతడు నిందితుడిగా ఉండటంతో ఆ కేసులో బెయిల్ లభించింది. భారత్–పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 2007 ఫిబ్రవరి 18న భారీ పేలుడు జరిగింది. ఢిల్లీకి 80 కిమీ దూరంలో ఉన్న పానిపట్ సమీపంలోని దివానా వద్ద జరిగిన ఈ ఘటనలో మొత్తం 68 మంది పాక్ పౌరులు మరణించారు.
ఈ కేసును తొలుత స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిప్పటికీ ఆపై కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది. ‘సంఝౌతా’లో వినియోగించిన బాంబులు హైదరాబాద్‌లోని మక్కా మసీదు, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాల్లో వినియోగించిన వాటిని పోలి ఉన్నాయి. దీంతో దర్యాప్తు సంస్థలు ఇవన్నీ ఒకే మాడ్యుల్ పనిగా నిర్థారించాయి. ‘మక్కా’, ‘అజ్మీర్’ కేసుల్లో అసిమానంద కీలక నిందితుడిగా తేలడంతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడులోనూ నిందితుడిగా చేర్చింది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను అధికారులు 2010లో అరెస్టు చేసింది. అప్పట్లోనే ‘మక్కా’ కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి విచారించింది.
తాను చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే కలీమ్ అనే వ్యక్తి పరిచయంతో పరివర్తన చెందానంటూ ఎన్‌ఐఏ విచారణలో బయటపెట్టిన విషయం విదితమే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన సర్కార్ బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు.
తరచూ ఉగ్రవాదంపై చర్చిస్తూ దీనికి ప్రతీకారంగా దాడులకు దిగాలంటూ అను^è రులను రెచ్చగొట్టేవాడు. ‘మక్కా’ కేసుల్లో నిందితులుగా ఉండి పట్టుబడిన దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మల విచారణలో అసిమానందకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ కేసులో బెయిల్ లభించింది. ఇప్పుడు ‘సంఝౌతా’లోనూ బెయిల్ మంజూరైంది. ‘మక్కా’ కేసులో బెయిల్ రాకపోవడంతో నగరానికి తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.