పుష్పపల్లకీలో మల్లన్న విహారం..
- ·సంక్రాంతిన నందివాహనుడై మల్లన్న
- వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం
శ్రీశైలం: శ్రీశైల ఆలయప్రాంగణంలో నిర్వహిస్తున్న మకర సంక్రమణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కనుమ పర్వదినాన మల్లన్న పుష్పపల్లకీలో విహరిస్తూ భక్తులకు కనులపండువగా దర్శనమిచ్చారు. శనివారం సంక్రాంతి పర్వదినం నాడు ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లను నందివాహనంపై ఆవహింపజేసి విశేష వాహనసేవలను నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించి తిరిగి ఆలయప్రాంగణానికి చేర్చారు. ఆ తరువాత స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో శ్రీపార్వతీ సమేతుడైన శ్రీ మల్లికార్జునస్వామి వారికి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి కనుమ పర్వదినాన శ్రీ పార్వతీసమేత మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలను నిర్వహించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను ఆలయప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన పుష్పపల్లకిలో స్వామిఅమ్మవార్లను ఉంచి అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు అదేరోజు రాత్రి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా వేదపండితులచే వేదస్వస్తి జరిగింది. ఆగమశాస్త్ర సాంప్రదాయానుసారం కల్యాణోత్సం చేసుకున్న పార్వతిదేవీ నాగవల్లి కార్యక్రమంలో భాగంగా మెట్టెలు,నల్లపూసలను అలంకరించారు. పుష్ప పల్లకీ తయారీలో తెలుపు, పసుపు చేమంతి, బంతి, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్‌రోజ్, స్టార్‌రోజ్, ఆస్టర్, అస్ప్రిడ్స్, పన్నీరుఆకు తదితర పుష్పాలను వినియోగించారు.