మమ అనిపించారు
మమ అనిపించారు
Published Wed, Oct 19 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
ఏలూరు (మెట్రో): ‘మా మండలం గుండా పోలవరం కుడికాలువ వెళ్లడంతో మధ్యలో బ్రిడ్జిల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, మా మండలంలో రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు అందలేదు, ప్రతి సొసైటీకి గడ్డి రవాణాకు ట్రాక్టర్లు ఇస్తామన్నారు ఇప్పటికీ ఇవ్వలేదు, పశుసంవర్ధక శాఖలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారో మాకు తెలీడం లేదు’ ఇవి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల నోట వినిపించిన మా టలు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మం దిరంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. 73 ప్రభుత్వ శాఖలకు చెందిన అంశాలను చర్చించేందుకు అజెండాలో పొందుపరిచారు. ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, వైద్యారోగ్య శాఖ, శిశు సంక్షేమశాఖ, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, గృహ నిర్మాణం వంటి శాఖలపై చర్చించారు. సమావేశం ఆద్యంతం మమ అన్న రీతిలో సాగింది.
అధికారులు పట్టించుకోవడం లేదు
అధికారంలో ఉన్నా అధికారులతో పనులు చేయించుకోవడంలో మాత్రం వెనుకబాటులో ఉన్నామని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే సమస్యలపై గత సమావేశాల్లో చర్చించినా ఇప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, పెదవేగి, దేవరపల్లి ఇలా పలు మండలాల సభ్యులు సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ పెదవివిరిచారు. గత సమావేశంలో ప్రతి ఒక్క సొసైటీకి ట్రాక్టర్ మంజూరు చేయిస్తామని కలెక్టర్ చెప్పినా ఇప్పటికీ వాటి ఊసు ఎత్తడం లేదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు.
బహిరంగ మలవిసర్జన రహితమే లక్ష్యం
బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా ముం దుకు వెళుతున్నామనీ ఈ నేపథ్యంలో ఏ ఒక్క నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకున్నా లక్ష్యం నెరవేరదని చైర్మన్ బాపిరాజు అన్నారు. జిల్లాలో 1,71,978 మరుగుదొడ్లు మంజూరు చేయగా లక్ష నిర్మాణాలు పూర్తికాగా 70 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. చింతలపూడి నియోజకవర్గంలో 13,145 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా 11,172 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
వ్యవసాయం, ఉద్యాన పంటల్లో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయాధికారులను ఆయన ఆదేశించారు. మత్స్య, పశుసంవర్ధక తదితర శాఖల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు రైతులకు తెలియజేయాలని జెడ్పీ చైర్మన్ సూచించారు.
ప్రస్తావించిన సమస్యలు
∙తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పశువుల శాలలకు, పౌల్ట్రీలకు విద్యుత్ చార్జీల్లో టారిఫ్‌ను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందరికీ తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని కోరారు.
∙ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ రానున్న సీజన్‌లో డెల్టా ప్రాంతంలో ఆధునికీకరణ పనులు చేపట్టేం దుకు ఇప్పటి నుంచే అంచనాలు తయారు చేసి నవంబరులోగా టెండర్లు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
∙డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రబీ పంటకు 254 సొసైటీల ద్వారా రుణాలివ్వడం ప్రారంభించామన్నారు.
∙మత్స్యకార సంఘాల చెరువులు లీజుకు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలపై ఇన్‌చార్జి కలెక్టర్ పి.కోటేశ్వరరావు స్పందించారు. ఇటువంటి వ్యవహారాలు జరిగి నట్టు రుజువైతే సంఘాల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
∙ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం గురించి ఆకివీడు జెడ్పీటీసీ, పోలవరం కాలువ నిర్మాణం వల్ల రోడ్లు చిధ్రం అయ్యాయని దేవరపల్లి జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు. పలువురు జెడ్పీటీసీలు గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలనే మరలా లేవనెత్తారు.
సభ్యులు 70 మంది.. గైర్హాజరు 28 మంది
కీలకమైన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశానికి 70 మంది సభ్యులు హాజరుకావాల్సి ఉన్నా 42 మంది మాత్రమే హాజరయ్యారు. ఇద్దరు మంత్రులు రాష్ట్ర కేబినేట్ సమావేశం ఉందని సభకు రాలేదు. తణుకు, కొవ్వూరు, ఉండి ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు హాజరుకాలేదు.
జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, విప్ అంగర రామ్మోహనరావు, డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, పశుసంవర్ధక శాఖ జేడీ టి.జ్ఞానేశ్వరరావు, డ్వామా పీడీ డి.వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యులు కాసర సాగర్, ఎన్.వెంకటచలపతిరావు, గంటా సుధీర్, ఎం.లక్ష్మిరమణి, బండి రామారావు, రామచంద్రరావు, కిలపర్తి వెంకట్రావు పంచాయితీరాజ్ ఎస్‌ఈ ఎస్.మాణిక్యం, డీఎస్‌వో శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement