వ్యక్తి దారుణ హత్య
ఉదయగిరి : ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ సమీపంలో బాలాజీ వైన్‌షాపు ఆవరణలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలో సంతవ్సరం నుంచి నరిసింహులు అనే వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకుంటూ, యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. యాచించగా వచ్చిన డబ్బుతో మద్యం సేవించాడు. ఈ క్రమంలో సొమవారం రాత్రి మద్యం సేవించి బాలాజీ వైన్‌షాపు ఆవరణలో ఉన్న ఓ బడ్డీ కొట్టు సమీపంలో నిద్రకు ఉపక్రమించాడు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న బడ్డీకొట్టు తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా నరసింహులు పెద్దగా కేకలు వేస్తూ అడ్డుకోబోయాడు. దీంతో వారు నరసింహలు తలపై బలమైన ఆయుధంతో మోదడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. బడ్డీ కొట్టులోని 20 మద్యం బాటిళ్లు, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు, కొంత చిల్లర నగదు తీసుకెళ్లారు.
రంగంలోకి క్లూస్ టీం..
రోజులానే బడ్డీకొట్టు యజమాని మంగళవారం వేకువజామున 4.30 గంటలకు కొట్టుకు వచ్చి నరసింహులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. సీఐ ఏవీ రమణ, ఎస్‌ఐ ఎన్.ప్రభాకర్ సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రల నమూనాలు సేకరించింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఎవరూ బంధువులు లేకపోవడంతో మృతదేహాన్ని పంచాయతీకి అప్పగించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి తూర్పువైపు ఉన్న ముళ్లపొదల వైపు వెళ్లింది. అక్కడి నుంచి పంచాయతీ బస్టాండు వద్ద ఉన్న ట్యాంక్‌బండ్ నుంచి పెట్రోలు బంకువైపు కొద్దిదూరం వెళ్లింది. అక్కడి నుంచి వెనుతిరిగి సంఘటన స్థలానికి చేరుకుంది. క్లూస్‌టీం అధికారి, ఏఎస్సై రాజు, హాండ్‌లర్ సుకుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.