మనోడే కదా అనుకుంటే నామం పెట్టాడు
♦ నమ్మిన వ్యక్తికి రూ. 20 లక్షల టోకరా
♦ దర్జాగా బ్యాంకుల్లో డిపాజిట్
♦ పోలీసుల విచారణలో నేరం అంగీకారం
♦ కటకటాలపాలైన నిందితుడు
కందుకూరు: నమ్మిన వ్యక్తికి ఓ ప్రబుద్ధుడు రూ. 20 లక్షలకు టోకరా వేశాడు. అరుుతే బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిని కటకటాల వెనక్కు పంపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ప్రకాశరావు వివరాలు వెల్లడించారు. స్థానిక పాతబ్యాంక్‌బజార్ నివాసి తుమ్మల వెంకట కృష్ణారావు గతంలో నెల్లూరులోని నారాయణ కాలేజీ యాజమాన్యానికి దాదాపు రూ. 18లక్షలను, ఒకటిన్నర రూపాయి లెక్కన నెలవారీ వడ్డీకి అప్పుకి ఇచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల నారాయణ కాలేజీ యాజమాన్యం.. కృష్ణారావుకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని నెల్లూరుకు రావాలని కోరింది. అరుుతే ఆయన అనోరోగ్యంతో బాధపడుతుండడంతో వెళ్లలేక, తన ఇంటిముందు ఉండే పరిచయస్తుడు ఎం. బాలాజీ సింగయ్య వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుని రావాలని కోరాడు. దీనికి బాలాజీ సింగయ్య అంగీకరించడంతో.. తన వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు ఇచ్చి నెల్లూరు పంపాడు.
యూజమాన్యం లెక్క చూసి అసలు, వడ్డీ కలిపి.. మొత్తం రూ. 20,52,000 బాలాజీ సింగయ్యకు ఇచ్చింది. అయితే సింగయ్య డబ్బును కృష్ణారావుకు ఇవ్వలేదు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో రూ. 5 లక్షలు, కెనరాబ్యాంకులో రూ. 2లక్షలు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 5లక్షలు, తన భార్య నీలిమపై కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. 5లక్షలు, కెనరా బ్యాంకులో రూ. 3లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. మిగిలిన 52 వేలల్లో రూ. 40 వేలు పిల్లల స్కూల్ ఫీజులు, రూ. 12వేలు ఇతర ఖర్చులకు వాడుకున్నాడు. ఇదిలా ఉంటే కృష్ణారావు తన డబ్బులు గురించి అడుగ్గా నెల్లూరు నుంచి తెచ్చిన వెంటనే నీకు ఇచ్చాను కదా అని బకాయించడం మొదలు పెట్టాడు. తనకేం సంబంధం లేదంటూ నాటకాలు మొదలు పెట్టాడు. దీంతో కృష్ణారావు పోలీసులను ఆశ్రయించాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. కేసును ఛేదించిన సీఐ లక్ష్మణ్, ఎస్సై హజరత్తయ్యలను డీఎస్పీ అభినందించారు.