శ్రీకాకుళం సిటీ: ఎచ్చెర్ల మండలంలో ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు చాకచక్యంతో చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం దారపువానిపేటకు చెందిన బోర రాములమ్మతో అదే గ్రామానికి చెందిన సుగంధి లక్ష్మణరావు నాలుగు నెలల నంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారిద్దరి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా దీన్ని గుర్తించామన్నారు. రాములమ్మ తనను ఎక్కడికైనా తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టమని లక్ష్మణరావును వేధించడంతో విరక్తి చెందిన లక్ష్మణరావు ఎలాగైనా రాములమ్మను చంపేయాలని పథకం పన్నినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 14న సాయంత్రం రాముల్మను జీడిమామిడి తోట వద్దకు రమ్మని చెప్పి పథకం ప్రకారం ఆమెపై లక్ష్మణరావు దాడి చేశాడని తెలిపారు. కర్రతో తలపై కొట్టడమే కాకుండా ఆమె మెడపై కర్రను అణిచివేయడంతో మృతి చెందినట్టు ఎస్పీ వివరించారు.
బంగారు ఆభరణాలు స్వాధీనం
రాములమ్మ చనిపోయిందని నిర్ధారణకు వచ్చాక ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను లక్ష్మణరావు తీసుకుపోయాడని ఎస్పీ చెప్పారు. వీటిలో రెండు తులాల బంగారు పుస్తెలతాడు, రెండు పుస్తెలు, రెండు బుట్టల బంగారు ఆభరణాలను ఓ పశువుల శాలలో దాచి పెట్టినట్లు నేర పరిశోధనలో ముద్దాయి లక్ష్మణరావు ఒప్పుకున్నాడని చెప్పారు. అలాగే రాములమ్మపై దాడి చేసిన కర్రను పక్కనే ఉన్న చిన్నపాటి చెరువులో పడేసాడన్నారు. మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు పర్సు, కర్ర, రెండు మొబైల్ ఫోన్‌ల చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. భర్తకు దూరంగా ఉన్న రాములమ్మ ఇద్దరు పిల్లలతో కలసి పుట్టింట్లోనే గత కొన్నేళ్లుగా నివాసం ఉంటోందన్నారు.
పోలీసులకు అభినందన
ఇది మర్డర్ ఫర్ గెయిన్ కేసుగా ఎస్పీ బ్రహ్మారెడ్డిగా పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, ఎచ్చెర్ల సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐలు సీహెచ్ రామారావు, వి.సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
Published Thu, Oct 20 2016 8:52 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement