పండుగకు ముందే పరలోకాలకు..
- వేగంగా దూసుకొచ్చి ఢీకొన్న కారు
- ఎగిరి అల్లంత దూరంలో పడ్డ స్కూటరిస్టు
- విధులు ముగించుకొని ఇంటికొస్తూ ప్రాణాలు కోల్పోయిన వైనం
మరో రెండ్రోజుల్లో రంజాన్ పండుగ.. పిల్లలకు కొత్త బట్టలు తెద్దామంటే ఇంకా జీతం రాలేదు. కనీసం అమ్మానాన్న వద్దకెళ్లి డబ్బులు తెచ్చుకుందామని వెళ్లిన అతనికి అదే ఆఖరి ప్రయాణమవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు. మృత్యువులా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో స్కూటర్‌పై వెళ్తున్న అతను ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు. ప్రాణాలు కోల్పోయాడు. అమ్మానాన్నకు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు పసిబిడ్డలకు తండ్రి అయిన అతని అకాల మృతి రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది.
- గార్లదిన్నె (శింగనమల)
హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన అల్లిపీరా(42) దుర్మరణం చెందారు. ఆయన గుత్తిలోని రైల్వే శాఖలో డిజిల్ షెడ్‌లో ఉద్యోగం చేసేవారు. అనంతపురంలో కాపురముంటూ ప్రతి రోజూ గుత్తికి వెళ్లొచ్చేవారు.
రెండు కుటుంబాలకు పెద్దదిక్కుగా...
అటు అమ్మానాన్న కల్లూరులో ఉంటుండగా, ఇటు భార్యా, ముగ్గురు పిల్లలతో కలసి అల్లిపీరా అనంతపురంలో నివసిస్తున్నారు. ప్రతి రోజూ డ్యూటీకి వెళ్లొచ్చేవారు. రోజులాగే శుక్రవారం ఉదయం 7 గంటలకే డ్యూటీకి వెళ్లిన ఆయన సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌లో అనంతపురం తిరుగుప్రయాణమయ్యారు.
అమ్మానాన్నను చూసొద్దామనుకుని...
గుత్తి-అనంతపురం మార్గంలోని కల్లూరులో ఉంటున్న అమ్మానాన్న రహమత్, మునాఫ్‌ను చూసొద్దామనుకున్న ఆయన ఇంటికెళ్లారు. ఆ సమయంలో తండ్రి మాత్రమే ఇంట్లో ఉండగా, తల్లి పక్కింటికి వెళ్లి ఉన్నారు. ఆమె వచ్చేలోగా బైక్‌కు పెట్రోల్ పోయించుకువస్తానంటూ వెళ్లిన ఆయన అంబేడ్కర్ సర్కిల్‌లోని కల్లూరు రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి గుత్తి వైపునకు వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అల్లిపీరా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే వృద్ధ తల్లిదండ్రులతో పాటు భార్యా పిల్లలు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అల్లిపీరాను చూడగానే గుండెలు పగిలేలా రోదించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
బైక్ అదుపు తప్పి...
యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికి మండలం బొగాలకట్ట గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు పమ్రాదంలో పుప్పాల గ్రామానికి చెందిన నరసింహులు(35) అనే రైతు మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. పుప్పాల నుంచి ఆయన బైక్‌లో రాయలచెరువుకు బయలుదేరగా మార్గమధ్యంలో బైక్ అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బ్యాంకులో రుణం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.