
పరిటాల పేరుతో హల్‌చల్
- రైతు పొలాన్ని దౌర్జన్యంగా దున్నేసిన వైనం
- పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న బాధితుడు
కళ్యాణదుర్గం రూరల్ : పరిటాల రవి అనుచరుల పేరుతో ఓ రైతు వేసుకున్న పొలాన్ని దున్నేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే... మండల పరిధిలోని బాలవెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, మాదవయ్యలకు 725 – 1 సర్వేలో నాలుగు ఎకరాలు ఉంది. 15 ఏళ్లు వారు అందులో పంటలు పండిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి 3 ఎకరాలను నీటి తడి కింద వేరుశనగ సాగు చేశారు. అయితే వారం రోజుల క్రితం ఓ వ్యక్తి ఆ భూమి మాది మీకు దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ సాగు చేసిన వేరుశనగను దున్నేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
వేరుశనగ సాగు కోసం ఇప్పటికే రూ.50 వేలు ఖర్చు చేశానని ఇప్పుడు ఇలా దున్నేయడంతో తనకు నష్టం జరిగిందని వాపోయారు. ఇదేవిషయాన్ని పోలీసులకు చెప్పినా వారు కూడా పట్టించుకోలేదని చెప్పారు. పరిటాల వారి పేరు చెప్పిన వెంటనే తమకు పోలీసులు కూడ రక్షణ ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులతో భూ సమస్య ఏర్పడితే తాము కోర్టులో కూడా వస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.
అయితే తమ భూమిని ఎలాగైనా లాక్కోవాలనే పరిటాల అనుచరుడినంటూ తమ పొలాన్ని భానుకోటకు చెందిన యువరాజు అనే వ్యక్తి దున్నేశారని చెప్పారు. ఇప్పటికైన పోలీసులు తనకు పోలీసులు రక్షణ కల్పించి న్యాయం చేయాలన్నారు. ఇదే విషయంపై ఎస్‌ఐ నబీరసూల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... పొలాన్ని దున్నేసినట్లు తనకు ఫిర్యాదు అందిందని, ఈ విషయంపై విచారణ ఇంకా పూర్తి కాలేదనీ, త్వరలో సమస్య పరిష్కారమయ్యేలా చూఽస్తామన్నారు.