చాంద్రాయణగుట్ట: సహజ మరణంగా నమోదైన కేసును సీసీ కెమెరాల ఆధారంగా చార్మినార్ పోలీసులు హత్య కేసుగా నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో గురువారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పేట్లబురుజు ప్రాంతానికి చెందిన అబ్దుల్ సత్తార్(24) బ్యాండ్ వాయిస్తుంటాడు. ఈ నెల 21న కొత్తపేటలో జరిగిన వివాహంలో బ్యాండ్ వాయించి తోటి కార్మికులతో కలిసి ఆటోలో సిటీ కాలేజీ వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఆటో దిగిన సత్తార్ పక్కనే ఉన్న వైన్స్‌కు వెళ్లి మద్యం తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు.
ఇదే సమయంలో వెనుకే వస్తున్న వట్టేపల్లికి చెందిన హోటల్ కార్మికుడు మహ్మద్ ఇస్మాయిల్(45) సత్తార్ చెప్పును తొక్కడంతో తెగిపోయింది. దీంతో తనకు కొత్త చెప్పులు కావాలని సత్తార్ పట్టుబట్టి ఇస్మాయిల్ జేబులో ఉన్న రూ. 220లు లాక్కొన్నాడు. వెంటనే రోడ్డు అవతల ఉన్న షాప్‌కు వెళ్లి రూ. 50లు వెచ్చించి చెప్పులు తీసుకున్నాడు. ఇది గమనించిన ఇస్మాయిల్ తనకు మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చేయమని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సత్తార్ తీవ్ర ఆగ్రహంతో ఇస్మాయిల్ ముఖంపై పిడి గుద్దులు గుద్ది రోడ్డుపైకి బలంగా తోసి వెళ్లిపోయాడు. దీంతో ఇస్మాయిల్‌కు తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
స్థానికుల సమాచారం మేరకు అపస్మారక స్థితిలో పడివున్న బాధితుడిని చార్మినార్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 22వ తేదీన బాధితుడు మృతి చెందాడు. ఈ ఘటనపై మొదట సహజ మరణం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. నిందితున్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబూరావు, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, చార్మినార్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.