భార్య తన మాట వినలేదనే కోపంతో షేక్ బషీర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుత్తి పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
గుత్తి : భార్య తన మాట వినలేదనే కోపంతో షేక్ బషీర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుత్తి పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కటిక బజారులో షేక్ బషీర్, సాధిక సంజరీ నివాసముంటున్నారు. షేక్ బషీర్ పట్టణంలోని బీరువాల షాపులో పని చేస్తున్నాడు. భార్య సాధిక పాటలు పాడుతుండేది. అయితే ఇటీవల వారు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో బషీర్ మద్యం, మట్కాకు బానిసయ్యాడు. దీంతో గొడవలు రోజు రోజుకూ తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు మాసాల క్రితం భర్త షేక్ బషీర్ నుంచి సా«ధిక సంజరీ విడిపోయింది.
సాధిక సంజరీ గాయనిగా ఖవ్వాళీ చెబుతూ జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో గుత్తి కోట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని సందడి చేద్దాం రండి పేరుతో సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాధిక సంజరీ వెళ్లింది. బషీర్ కూడా కార్యక్రమానికి వెళ్లారు. అయితే సాధిక సంజరీ స్టేజ్ ఎక్కకూడదని, పాటలు పాడకూడదని భర్త షేక్ బషీర్ ఆర్డర్ వేశాడు. అయితే పాటలు పాడితేనే నాలుగు డబ్బులు వస్తాయని నేను పాటలు పాడి తీరుతానని ఆమె స్టేజ్ ఎక్కింది. దీంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఖవ్వాళీకి వచ్చిన వారు భయాందోళనతో పరుగులు తీశారు. కొందరు కంబళి తెచ్చి మంటలు ఆర్పారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. కాగా సాధిక తన భర్త నుంచి ప్రాణ భయం ఉందని మంగళవారం ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.