
మోసేవారు లేక... సైకిల్‌పై శవయాత్ర
కలువాయి (నెల్లూరు) : లోకాన్ని వీడిన ఆ దేహాన్ని మోసుకెళ్లేందుకు సమయానికి నలుగురు ముందుకు రాలేదు. చేసేది లేక వరుసకు సోదరుడైన వ్యక్తి సైకిల్‌పై మృతదేహాన్ని మోసుకెళ్లాడు. కంటతడి పెట్టించే ఈ హృదయ విదారకర దృశ్యం మంగళవారం నెల్లూరు జిల్లా కలువాయిలో కనిపించింది. తమళనాడు రాష్ట్రానికి చెందిన కొందరు కలువాయిలో ఉంటూ చుట్టుపక్కల పల్లెల్లో దుప్పట్ల అమ్మకంతో జీవనం సాగిస్తున్నారు.
వారిలో సంబురాజు (70) అనే వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురికాగా మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ కనిపించలేదు. దీంతో సంబురాజు మృతదేహాన్ని సోదరుడు గోవిందరాజు తన సైకిల్‌పై పెట్టుకుని శ్మశానం వరకు తీసుకెళ్లి అక్కడ కూర్చున్నాడు. అది చూసిన కొందరు పంచాయతీ వారికి సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ ఇందిర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు.