ఉస్మానియా యూనివర్సిటీ: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ దండోర ఉద్యమాన్ని మనువాదులకు తాకట్టుపెట్టారని ఎమ్మార్పీఎస్–టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాతకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్ ప్రసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. శనివారం ఓయూ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణ సాధనకు అఖరు పోరాటమని ప్రకటించిన మందకృష్ణ మాదిగలను, మాదిగ ఉపకులాలను మనువాదులకు తాకట్టుపెట్టి మరో సారి మోసం చేశారన్నారు.
వర్గీకరణకు ప్రధాని సుముఖంగా ఉన్నారని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుపెడతామని ప్రకటించిన వెంకయ్యనాయుడు సమావేశాల్లో వర్గీకరణ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధిలేని వెంకయ్యనాయుడు కాళ్లు మొక్కి, అంబేద్కర్‌తో పోల్చిన మందకృష్ణమాదిగ జాతికి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేడిపాపాయ్యమాదిగ, సుంకపాక దేవయ్యమాదిగ, సురేందర్ మాదిగ, సునీల్, బీవీ రమణ, అలెగ్జాండర్, కొంగరి శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.