క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం | mantra of discipline .. patriotic principle | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం

Published Sat, Nov 26 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం

క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం

- భావిభారత పౌరుల తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ కీలకం
- ఎన్‌సీసీతో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు
- జిల్లాలోని ప్రముఖులు ఈ కోవలోని వారే...!
- నేడు ఎన్‌సీసీ డే
 
క్రమశిక్షణమైన జీవితం, నిజాయితీగా బతకడం, ఎంతటి కఠోరశ్రమనైనా తట్టుకోవడం, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలదొక్కుకోవడం, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండగలిగే మనోస్థైర్యాన్ని చిన్నతనంలోనే పెంపొందించడం,  సమాజం గురించి తెలుసుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించడం.. ఇలాంటి లక్షణాలన్నీ ఎన్‌సీసీతో సాధ్యమవుతాయనడంలో అతిశయోక్తి లేదు. చదువుతో పాటు ఇతర అంశాల్లో అవగాహన కల్పించేందుకు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇప్పుడు ఎన్‌సీసీలో చేర్పిస్తున్నారు. తద్వారా వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారం (ఈనెల 27న) ఎన్‌సీసీ డే ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.   
- కర్నూలు(హాస్పిటల్‌)
 
ఎన్‌సీసీ (నేషనల్‌ కేడెట్‌ కాప్స్‌) అంటే క్రమశిక్షణకు కేరాఫ్‌ అడ్రస్‌. డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ, దేశభక్తి తదితర విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందే భావిభారత పౌరులు. జిల్లాలో 2002వ సంవత్సరం వరకు తిరుపతి హెడ్‌క్వార్టర్‌గా ఎన్‌సీసీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత కర్నూలు కేంద్రంగా 2002లో స్థానిక డాక్టర్స్‌ కాలనీలో ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌ క్వార్టర్‌ ప్రారంభమైంది. దీని పరిధిలో ప్రస్తుతం బాయ్స్‌ బెటాలియన్, 28 ఆంధ్రా బెటాలియన్, కర్నూలు, అనంతపురం గర్ల్‌ బెటాలియన్, వన్‌ ఆంధ్రా మెడికల్‌ కంపెనీ ఉన్నాయి. జిల్లాలోని 71 పాఠశాలలు, 30 కళాశాలల్లో మొత్తం 10,250 మంది ఎన్‌సీసీ కేడెట్లు ఉండగా, ఇందులో 4,350 మంది బాలురు, 5,900 మంది బాలికలు ఉన్నారు. కర్నూలు గ్రూపులో ఆరు మంది ఆర్మీ ఆఫీసర్లు, 75 మంది జేసీవోలు, ఓఆర్‌లు, 100 మంది సాధారణ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ప్రతి కళాశాలలో ఒక ఎన్‌సీసీ ఆఫీసర్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. 
 
ఎన్‌సీసీలో మూడు రకాల శిక్షణ
ఇన్సిట్యూషన్‌ ట్రైనింగ్‌ 
ఎన్‌సీసీ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ, విపత్తు నివారణలో శిక్షణ, మ్యాప్‌ రీడింగ్, ఫైరింగ్, బ్యాటిల్‌ క్రాఫ్ట్, ఫీల్డ్‌ క్రాఫ్ట్‌ వంటి అంశాల్లో ప్రత్యేక తరగతుల్లో శిక్షణ ఇస్తారు. 
 
క్యాంప్‌ ట్రైనింగ్‌ 
ఈ శిక్షణను అనంతపురం జిల్లా పూడేరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 10 రోజుల పాటు ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తారు. ఇన్సిట్యూషన్‌ ట్రైనింగ్‌లో ఇచ్చే శిక్షణతో పాటు వైద్యం, ఫైర్‌ ఫైటింగ్, రెడ్‌క్రాస్‌ సేవలు, 108 సేవలు, కమ్యూనిటీ లివింగ్, స్నేహితులతో ఎలా మెలగాలి వంటి అంశాలను నేర్చుకుంటారు. 
 
అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ 
ఇందులో భాగంగా ఆర్‌డీసీ (రిపబ్లిక్‌ డే క్యాంపు), తలసైనిక్‌ క్యాంపులకు ఎన్‌సీసీ విద్యార్థులను పంపించేందుకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తారు. ఆర్‌డీసీలో భాగంగా ఢిల్లీలో డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, గార్డ్‌ ఆఫ్‌ ఆనర్, బెస్ట్‌ కేడెట్‌ కాంపిటీషన్‌ నిర్వహిస్తారు. ఫ్లాగ్‌ ఏరియా కాంపిటీషన్‌ను ఉప రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి, మూడు రకాల భద్రతాధికారుల సమక్షంలో మోడల్‌ రూపొందించి ప్రదర్శిస్తారు. తలసైనిక్‌ క్యాంపునకు పంపించేందుకు సైతం పై విధంగానే ఎంపికలు నిర్వహించి ఢిల్లీకి పంపిస్తారు. ఇది పూర్తిగా ఆర్మీలో ఇచ్చే శిక్షణ ఇస్తారు. ఆఫ్సిటికల్స్‌ ట్రైనింగ్, మ్యాప్‌ రీడింగ్, జడ్జింగ్‌ డిస్టెన్‌ ఫీల్డ్‌ సిగ్నల్స్, హెల్త్‌ అండ్‌ హైజనింగ్‌లలో శిక్షణ ఉంటుంది. పాఠశాల స్థాయి పిల్లలకు ఏ- సర్టిఫికెట్, కళాశాల స్థాయి పిల్లలకు బీ,సీ సర్టిఫికెట్‌ పరీక్షలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. 
 
ఎన్‌సీసీ ప్రయోజనాలు
ఎన్‌సీసీలో పలు రకాల సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆర్‌డీసీ, తలసైనిక్‌ క్యాంపుల్లో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ సీట్ల కేటాయింపులో వీరికి రిజర్వేషన్‌ ఉంటుంది. దీంతో పాటు యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలోనూ వీరికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎన్‌సీసీలో చేరడంతో పిల్లల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ అలవడుతుంది. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేన్‌ స్కిల్స్, పరస్పర సహకారం, నిజాయితీగా జీవించడం వంటి లక్షణాలు అలవడతాయి. 
 
శిక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు: పీజీ కృష్ణ, గ్రూప్‌ కమాండర్‌
 ఎన్‌సీసీ విద్యార్థులకు అవసరమైన శిక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా స్వచ్ఛభారత్, బేటీ బచావో, బేటీ పడావో, షుగర్, ఎయిడ్స్, లెప్రసి, మానవహక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్‌సీసీ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.  
 
యూత్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌లో విదేశాలకు: గౌస్‌ బేగ్, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌
 యూత్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 20 మంది విద్యార్థులను ఇప్పటి వరకు విదేశాలకు పంపించాము. సిల్వర్‌జూబ్లీ కళాశాలకు చెందిన ధీరజ్‌ శ్రీనివాస్‌ కజకిస్తాన్, భాస్కర్‌ బంగ్లాదేశ్‌కు వెళ్లి వచ్చారు. వారు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల మనస్తత్వాలను పరిశీలిస్తారు. తద్వారా వారు భవిష్యత్‌లో సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement