సాక్షి, విశాఖపట్నం: కశ్మీర్ వేర్పాటువాదులకు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ విప్లవ జేజేలు పలికింది. అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామని, ప్రజాస్వామ్య వాదులు, ప్రగతిశీల శక్తులు ఇలాంటి ఉద్యమాలపై వాస్తవాలను ప్రచారం చేయాలని కోరింది. ఈ మేరకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు మావోయిస్టు కమిటీ రాజకీయ ప్రతినిధి జగబంధు పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. కశ్మీర్‌లో రిఫరెండం జరపాలని డిమాండ్ చేశారు. 21ఏళ్ల కశ్మీర్ యువకుడు బుర్హాన్ వానీ, అతని ఇద్దరు అనుచరులను పోలీసు బలగాలు పట్టుకుని చంపేసి ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మరణించాడని కట్టుకథలు చెప్పారన్నారని ఆరోపించారు.
వానీ మరణం తర్వాత కశ్మీర్‌లో ఇప్పటివరకు భారత సైన్యం 100 మందికి పైగా పౌరులను హత్య చేసిందని, 10,000 మందిని గాయపడ్డారని పేర్కొన్నారు. కశ్మీర్‌లోయ ఒక ‘నిర్బంధ శిబిరం’గా మారిందన్నారు. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్‌లో 70వేల మందికిపైగా పౌరులను ప్రభుత్వ కిరాయి మూకలు హత్య చేశాయని, 8వేల మందిని మాయం చేశాయని, అత్యాచారాలు లెక్కలేనన్ని జరిగాయన్నారు. మోదీ హయాంలో హిందూ సంస్థలు, బీజేపీ చేస్తున్న ప్రకటనలు అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నాయన్నారు. మోదీ ఎన్నికల హామీలన్నీ బుట్టదాఖలయ్యాయన్నారు. త్వరలో యూపీ, పంజాబ్‌లలో ఎన్నికలు, మరోవైపు పెరిగిన ధరలు, నిరుద్యోగం, దళితుల ఆందోళనలు మోదీ సర్కారును కుదిపేశాయి. దీంతో దేశప్రజల దృష్టి మరల్చేందుకు కశ్మీర్ సమస్యను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదమని ప్రచారం మొదలుపెట్టారని లేఖలో పేర్కొన్నారు.
కశ్మీర్ వేర్పాటువాదులకు మావోల మద్దతు
Published Mon, Sep 19 2016 7:38 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement