Kashmir separatist
-
ఆపవయ్యా.. ఇదేమైనా టీవీ స్టుడియోనా?
న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై..’ కొట్టి దేశభక్తిని నిరూపించుకోవాలంటూ కోర్టు హాలులో నిందితుడికి సవాల్ విసిరిన ప్రభుత్వ న్యాయవదిని సాక్షాత్తూ న్యాయమూర్తే తీవ్రంగా మందలించిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్లనాటి హవాలా కేసులో ప్రముఖ కశ్మీరీ వేర్పాటువాద నేత షాబీర్ షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జులై 25న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ హవాలా బ్రోకర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా షాబీర్‌పై కేసు నమోదుచేసిన ఈడీ అధికారులు.. మరో వారం రోజుల రిమాండ్ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరిగాయి. విదేశాల నుంచి నిధులు సేకరించి, కశ్మీర్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న షాబీర్.. విచారణకు సహకరించడంలేదని, నిజానిజాలు రాబట్టేందుకు మరికొన్నిరోజులు రిమాండ్‌కు అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఈడీ తరఫున) వాదించారు. ప్రతిగా డిఫెన్స్ లాయర్.. చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా తన క్లయింట్ షాపై ఈడీ ఒత్తిడి చేస్తోందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ లాయర్.. షాబీర్ షాను సంబోధిస్తూ.. ‘నువ్వు నిజంగా దేశభక్తుడివే అయితే, భారత్ మాతాకీ జై..అని బిగ్గరగా అరువు’ అని సవాలు విరిసాడు. దీంతో ఖంగుతిన్న న్యాయమూర్తి.. ‘ఏంటిది? ఇదేమైనా టీవీ స్టుడియో అనుకుంటున్నావా? కోర్టు హాలన్న సంగతి మర్చిపోయావా? సవాళ్లు మానేసి పాయింటుకు రా’ అని తీవ్రంగా మందలించారు. చివరికి, షాబిర్‌షాను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పుచెప్పారు. -
కశ్మీర్ వేర్పాటువాదులకు మావోల మద్దతు
సాక్షి, విశాఖపట్నం: కశ్మీర్ వేర్పాటువాదులకు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ విప్లవ జేజేలు పలికింది. అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామని, ప్రజాస్వామ్య వాదులు, ప్రగతిశీల శక్తులు ఇలాంటి ఉద్యమాలపై వాస్తవాలను ప్రచారం చేయాలని కోరింది. ఈ మేరకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు మావోయిస్టు కమిటీ రాజకీయ ప్రతినిధి జగబంధు పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. కశ్మీర్లో రిఫరెండం జరపాలని డిమాండ్ చేశారు. 21ఏళ్ల కశ్మీర్ యువకుడు బుర్హాన్ వానీ, అతని ఇద్దరు అనుచరులను పోలీసు బలగాలు పట్టుకుని చంపేసి ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మరణించాడని కట్టుకథలు చెప్పారన్నారని ఆరోపించారు. వానీ మరణం తర్వాత కశ్మీర్లో ఇప్పటివరకు భారత సైన్యం 100 మందికి పైగా పౌరులను హత్య చేసిందని, 10,000 మందిని గాయపడ్డారని పేర్కొన్నారు. కశ్మీర్‌లోయ ఒక ‘నిర్బంధ శిబిరం’గా మారిందన్నారు. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్లో 70వేల మందికిపైగా పౌరులను ప్రభుత్వ కిరాయి మూకలు హత్య చేశాయని, 8వేల మందిని మాయం చేశాయని, అత్యాచారాలు లెక్కలేనన్ని జరిగాయన్నారు. మోదీ హయాంలో హిందూ సంస్థలు, బీజేపీ చేస్తున్న ప్రకటనలు అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నాయన్నారు. మోదీ ఎన్నికల హామీలన్నీ బుట్టదాఖలయ్యాయన్నారు. త్వరలో యూపీ, పంజాబ్‌లలో ఎన్నికలు, మరోవైపు పెరిగిన ధరలు, నిరుద్యోగం, దళితుల ఆందోళనలు మోదీ సర్కారును కుదిపేశాయి. దీంతో దేశప్రజల దృష్టి మరల్చేందుకు కశ్మీర్ సమస్యను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదమని ప్రచారం మొదలుపెట్టారని లేఖలో పేర్కొన్నారు.