- మార్చి నెలాఖరు వస్తున్నా దరి చేరని లక్ష్యం
- ప్రతి విభాగంలోనూ వెంటాడిన నిర్లక్ష్యం
- నిధులూ విడుదల కాని దుస్థితి...
- అంకెల గారడీ ... చరమాంకంలోనూ ఇదేమి బురిడీ
ఏ‘మార్చి’
Published Thu, Mar 9 2017 11:51 PM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
ఓ చిన్న కుటుంబం ... ఆ నెలలో ఇల్లు గడవాలంటే మొదటి వారంలోనే ఓ బుల్లి ప్రణాళిక వేసుకుంటారు. ఏడాదిపాటు నెట్టుకు రావాలంటే భార్య, భర్తతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఖాళీ సమయంలో ఓ దగ్గర కూర్చొని బియ్యం, పప్పులతోపాటు ముఖ్య నిత్యావసర వస్తువులతో భారీ ప్రణాళికనే రచించుకొని ఆ ప్రకారం క్రయ, విక్రయాలు ఉండేటట్టు చూసుకుంటారు. ఇల్లు ... కుటుంబానికే ఇంత ముందు చూపుతో అడుగులేస్తుంటే 54 లక్షల జనాభా ఉన్న జిల్లాను పరిపాలిస్తున్న అధికారులు, పాలకులు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్భాటంగా నిధులైతే కేటాయించి ఏడాదవుతున్నా సగం సొమ్ము కూడా విదల్చకుండా జిల్లా ప్రజలను ఏమార్చిన తీరుపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు ... విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రగతికి నిధులు, పేద, మధ్య తరగతికి ఇళ్లు, కాపులకే ఇవ్వాల్సిన రూ.90 కోట్లు...ఇలా ఏ ఒక్క లక్ష్యం దరిదాపులకు చేరుకోని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదల్చకపోతే తామేమి చేయగలమని కొంతమంది అధికారుల ప్రశ్న.
డ్వాక్రాకు టోకరా... 2016–17 ఆర్థిక సంవత్సరంలో 59,587 సంఘాలకు రూ.1346.24 కోట్లు రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది.
అలక్ష్యం : ఆర్థిక సంవత్సరం ముగిసే రోజు దగ్గరపడ్డా ఇంత వరకు కేవలం 23,861 సంఘాలకు రూ.601.45 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు..
ఎస్సీలకు మొండిచేయే...
లక్ష్యం: జిల్లాలో షెడ్యూల్ కులాల్లో ఉన్న నిరుద్యోగులు, యువతకు 5,053 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పిస్తామంటూ 4,775 యూనిట్లకు రూ.95.27 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.
అలక్ష్యం: ఇంకా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయలేకపో యారు.
ఒక్క ఇల్లు కడితే ఒట్టు...
లక్ష్యం: గూడులేని వారికి నీడ కల్పిస్తాం.
అలక్ష్యం: జిల్లాకు 24,198 ఇళ్లు కేటాయించగా కేవలం 11,896 ఇళ్లు మాత్రమే నిర్మాణం చేపట్టారు.
కాపులకూ హామీల కాటే...
లక్ష్యం: కాపు కార్పొరేష¯ŒS ద్వారా 4 వేల మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కలిపి రూ.80 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం.
అలక్ష్యం: కానీ ఒక్క రూపాయి కూడా అందజేసిన దాఖలాలు లేవు. బ్యాంకుల మధ్యే దరఖాస్తులు తిరుగుతున్నాయి.
బీసీలకూ అదే మోసం...
లక్ష్యం: జిల్లాలో బీసీలకు రూ.74.38 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం.
అలక్ష్యం: ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఇంతవరకూ ఎంపిక చేయలేదు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలు పూర్తి చేసి బ్యాంకుల ఆమోదం కోసం దరఖాస్తులు పంపించిన స్థాయిలోనే ఉండిపోయింది.
ఒట్టి వ్యవ‘సాయం’
లక్ష్యం : జిల్లాలో రైతులకు బంగారం,పంట రుణాలుగా రూ.7,084 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు.
అలక్ష్యం : 60 శాతం మించి రుణాలు ఇవ్వలేకపోయారు.
Advertisement