
దమ్మారో ధమ్...
యువత మత్తులో చిత్తవుతోంది. చదువు సంధ్యలను పక్కన పెట్టేసి దమ్ముమీద దమ్ము కొడుతోంది.
►కదిరిలో గమ్మత్తు దందా
►విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయాలు
►మైకంలో తేలిపోతున్న యువత
►చింతపల్లి నుంచి కదిరికి సరఫరా
►మత్తులో జోగుతున్న నిఘా
యువత మత్తులో చిత్తవుతోంది. చదువు సంధ్యలను పక్కన పెట్టేసి దమ్ముమీద దమ్ము కొడుతోంది. కన్నవారి కలలను కాలరాస్తూ మైకంలో తేలిపోతోంది. మత్తుకు బానిసగా మారి కన్నవారికి నరకం చూపుతోంది. కదిరి కేంద్రంగా సాగుతున్న ఈ గమ్మత్తు దందాకు వేలాది మంది బలైపోతున్నా...కఠినంగా వ్యవహరించాల్సిన ఖాకీ కళ్లు మూసుకుంది.
కదిరిలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీనివెనుక పట్టణానికి చెందిన ఓ ముఠా ఉంది. కదిరికి చెందిన వ్యక్తే ఆ ముఠా నాయకుడు కూడా. ఈయనకు పట్టణానికి చెందిన మరో నలుగురు వ్యక్తులు సహకరిస్తున్నారు. వీరు యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. మాయమాటలతో అమాయక యువకులను ఈ మత్తులోకి దింపి ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణంలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల వద్దే ఈ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో ప్యాకెట్(3గ్రాములు) రూ.100 చొప్పున చిన్న చిన్న పాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. విద్యార్థులు సిగరెట్లలోని పొగాకును కొంత తొలగించి, అందులో గంజాయిని కలుపుకొని దమ్ములాగిస్తున్నారు. యువకులకు అలవాటు చేసేందుకు మొదట్లో మూడు, నాలుగు రోజులు ఉచితంగానే గంజాయి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. వలీసాబ్‌రోడ్, మశానంపేట, రైల్వేస్టేషన్ రోడ్, రాయచోటి రోడ్, దేవళంవీధి ఇంకా పలుచోట్ల గంజాయి దందా సాగుతోంది.
కదిరికి చేరుతున్నదిలా...
పట్టణానికి చెందిన గంజాయి ముఠా నాయకుడు మున్సిపల్ పరిధిలోని పార్థసారథి కాలనీ, నిజాంవలీ కాలనీ, వీవర్స్ కాలనీకి చెందిన కొందరు మహిళలను గంజాయి రవాణా కోసం నియమించాడు. వారు వారానికోసారి వారు ఆర్టీసీ బస్సులో విశాఖపట్నం వెళ్తారు. అప్పటికే చింతపల్లి నుంచి తీసుకువచ్చి బ్యాగుల్లో నింపిన గంజాయిని 7 కిలోల చొప్పున ఒక్కక్కరూ తీసుకువస్తారు. ఇందుకు గాను వీరికి రూ. 3 వేల వరకు ఇస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లోనే...
కదిరి చెందిన మహిళలందరూ ప్రయాణికుల్లాగానే తమ బ్యాగుల్లో గంజాయిని భద్రపరచుకొని ఒక్కోసారి నేరుగా బస్‌లో కదిరికి చేరుకుంటారు. లేదంటే తలుపుల మండలం కుర్లిరెడ్డివారిపల్లి వద్ద బస్సు దిగి అక్కడి నుండి ఆటోల్లో వస్తారు. ఏదైనా అనుమానం వస్తే పులివెందులలోనే బస్సు దిగి అక్కడి నుండి మరో బస్సులో కదిరికి చేరుకుంటారు. ఈ గంజాయి దందా...రవాణా గురించి ఊరూవాడా తెలిసినా నిఘా వ్యవస్థ మాత్రం నిద్ర మత్తు నటిస్తోంది.
నాడీవ్యవస్థ పనితీరు మందగిస్తుంది
గంజాయి, హెరాయిన్, ఫోర్ట్‌విన్ ఇంజెక్షన్‌లు, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకుంటే నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కండరాలు, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది, అసహనం, కుంగుబాటు, బరువుతగ్గిపోవడం వంటి రుగ్మతల బారిన పడతారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కదిరి యువతలో ఎక్కువగా చూస్తున్నాం.
–డా.మదన్‌కుమార్, వైద్యనిపుణులు, కదిరి
తల్లిదండ్రులదే బాధ్యత
గంజాయి వంటి మత్తుకు పిల్లలు అలవాటు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు అడిగినంత డబ్బు ఇవ్వడం తప్పుకానప్పటికీ.. వారు ఎలా ఖర్చు చేస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వారి ప్రవర్తనపై ఓ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కళాశాలకు వెళ్లి పిల్లల చదువు, వారి స్నేహితుల వివరాలు ఆరా తీయాలి. తల్లిదండ్రులు పిల్లలతో రోజూ కాసేపు సరదాగా మాట్లాడేందుకు కొంత సమయం కేటాయించాలి. వారి ఇష్టమైన వ్యాపకాల్లో ప్రోత్సహించాలి.
– దశరథనాయక్, న్యాయవాది, కదిరి
నిఘా పెడతాం..
జిల్లాలో గంజాయితో పాటు ఇంకా ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. దీని వెనుక దాగి ఉన్న అసలు వ్యక్తులు వారు ఎంతటివారైనా వదిలి పెట్టం. యువత వాటి బారిన పడకుండా కళాశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక టీంలను నియమిస్తాం.
–జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ