► రహస్యంగా గంజాయి సిగరెట్ల అమ్మకాలు
►బానిసలవుతున్న యువకులు, విద్యార్థులు
► నిర్దేశించిన ప్రదేశాల్లో సరుకుతో సిద్ధంగా ఏజెంట్లు
► ఒక్కో సిగరెట్ రూ.50 నుంచి రూ.100దాకా
► మద్యం దుకాణాల మార్పిడితో ఊపందుకున్న అమ్మకాలు
మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో ఎక్కువగా యువత ఉంటున్నారు. ఇన్నాళ్లు రహస్య ప్రదేశాల్లో మాత్రమే గంజాయి అమ్మేవారు. ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద గంజాయి అమ్మకాలు ఊపందుకున్నాయి.
పలమనేరు: గంజాయి మత్తులో భావిభారత పౌరుల జీవితాలు చిత్తవుతున్నాయి. మద్యం కంటే నాలుగింతలు మైకం కలిగించే గంజాయి సిగరెట్ల అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. యువతే టార్గెట్‌గా అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం, పుంగనూరు తదితర పటణాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. వైజాగ్ నుంచి కొందరు ఏజెంట్ల ద్వారా జిల్లాకు గంజాయి చేరుతున్నట్టు ఇప్పటి కే పోలీసులు గుర్తించారు.
గతంలో పలమనేరు, చిత్తూరులో గంజాయితో పట్టుబడిన నిందితులు సైతం తమకు సరుకు విశాఖ నుంచి అందినట్టు తెలిపిన విషయం విదితమే. అక్కడికి చెందిన ప్రధాన ముఠా సరుకును కర్ణాటకకు చెందిన ఓ గ్యాంగ్‌కు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. వారి నుంచి జిల్లాలోని ఏజెంట్లకు చేరుతోంది.
నిర్దేశించిన చోట్లే అమ్మకాలు..
గంజాయి సిగరెట్ ప్యాక్‌లను పొందిన ప్రధాన ఏజెంట్లు వాటిని నమ్మకమైన వారి ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి రైల్వేస్టేషన్, యూనివర్సిటీ ప్రాంతం, రేణిగుంట, బైపాస్ రోడ్డు, చిత్తూరులోని మెసానికల్ గ్రౌండ్ ప్రాంతం, పీవీకేఎన్ కళాశాల మైదానం, తిరుత్తణి రోడ్డులోని ఆవాస ప్రాంతాలు, సంతపేట, కాజూరు, ముత్తురేవుల, మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండు, సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన, బీటీ కళాశాల మైదానం, అంగళ్లు, కుప్పం పట్టణంలోని పలు అవాస ప్రాంతాలు, పలమనేరులోని లక్ష్మీ థియేటర్, ఎద్దులచెరువు కట్ట సమీపంలోని పట్టుపరిశ్రమ కార్యాలయం, గోరీతోట, మధు కళాశాల వెనుక వైపు, గంటావూరు, గడ్డూరు కాలనీ తదితర చోట్ల రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ఏజెంట్లు సైతం అలవాటుపడిన వారికి తప్ప కొత్తవారికి వీటిని విక్రయించడం లేదు.
అనువైన ప్రాంతాలను ఎంచుకున్నారిలా..
సుప్రీం కోర్టు ఆదేశాలతో జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న పలు మద్యం దుకాణాలు పట్టణాలకు దూరంగా మార్చుకున్నారు. కొందరు తోపులు, కోళ్లఫారాలు, తాత్కాలిక షెడ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మందు బాబులకు అనుకూలంగా మారాయి. ఇదే అదునుగా గంజాయి సిగరెట్లు అమ్మేవాళ్లు ఇలాంటి ప్రదేశాల్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
రోడ్డున పడుతున్న జీవితాలు
ఒక్కసారి ఈ మత్తుకి అలవాటుపడితే మానుకోవడం చాలా కష్టం. పలమనేరుకు చెందిన ఓ యువకుడు విపరీతంగా గంజాయి సిగరెట్లను తాగి తీవ్రమైన అనారోగ్యంతో బెంగళూరులో లక్షలు వెచ్చించి ప్రాణాపాయం నుంచి బయటపట్టాడు. ఇలాంటి వారు మరెందరో జిల్లాలో ఉన్నా విషయాలు వెలుగుచూడడం లేదు. ముఖ్యంగా రోజువారి కూలీలు, డ్రైవర్లు, హమాలీలు వీటికి బానిసలుగా మారినట్టు సమాచారం. కష్టపడి సంపాదించిన డబ్బును ఇందుకోసం వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా యువత, బెట్టింగ్ రాయుళ్లు, కళాశాల విద్యార్థులు వీటికి బానిసలు కావడం గమనార్హం. డబ్బులు లేని సందర్భాల్లో తమ వద్దనున్న సెల్‌ఫోన్లు, ఉంగరాలను సైతం తాకట్టుపెట్టి సిగరెట్లు కొనే యూత్ ఉన్నారట. దీనిపై సంబంధిత శాఖలు, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ నిఘా ఉంచి ముఠా ఆట కట్టించాల్సిన అవరసరం ఎంతైనా ఉంది.
ఎలా తయారు చేస్తున్నారంటే..
జిల్లాలోని కొన్ని పట్టణాల్లో బీడీ చుట్టే కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి చోట్ల ఎంపిక చేసుకున్న వారితో మామూలు సిగరెట్లను ఇచ్చి వాటిలో పొగాకుతో పాటు 60:40శాతం గంజాయి పొడిని కలిపి ప్యాక్ చేస్తున్నట్టు తెలిసింది. అలా తయారైన సిగరెట్ ప్యాక్‌లకు ఓ గుర్తును వేసి సాధారణ సిగరెట్లలాగే ఏజెంట్లకు చేరవేస్తున్నారు.
కింగ్ సిగరెట్ అయితే వంద..
బర్కిలీ, సిజర్ సిగరెట్లలో నింపిన గంజాయి అయి తే రూ.50, కింగ్ సిగరెట్ అయితే రూ.వందదాకా అమ్ముతున్నట్టు తెలిసింది. మద్యం క్వార్టర్ బాటిల్ కొనాలంటే రూ.120 పెట్టాలి. అది కొద్దిసేపే మత్తు ఉండడంతో కొందరు మద్యంలో మత్తు మాత్రలు కలిపి సేవిస్తున్నారు. గంజాయి సిగరెట్ తాగితే నాలుగు గంటలకు పైగా మత్తులో జోగాల్సిందే.
యువతే టార్గెట్‌గా అమ్మకాలు..!
Published Sat, Aug 5 2017 12:20 PM | Last Updated on Mon, Sep 11 2017 11:21 PM
Advertisement
Advertisement