మార్కెట్ మూగబోయింది
మార్కెట్ మూగబోయింది
Published Sun, Dec 11 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
తాడేపల్లిగూడెం
కేజీ పది.. కేజీ పది ... రావాలి....రావాలి ... అనే కేకలు లేవు... ఆక్కయ్యగారు రండి. టమాటాలు చౌక. నేతిబీర లాంటి బీర మరింత చౌక. క్యాబేజీ ఊరుకొనే తీసుకెళ్లండి. అన్నయ్య గారు అల్లం , కొత్తిమిర కొత్తిమిర.. లాంటి కేకలతో ఆదివారం వస్తే చాలు ఇక్కడి మార్కెట్ సందడిగా ఉండేది. కొర్రమీనులున్నాయి. బొమ్మిడాలు వచ్చాయి. గుడ్డు పీతలున్నాయనే పిలుపులతో చేపల మార్కెట్ రద్దీగా ఉండేది. ఆ పిలుపులు లేవు. పెద్దనోట్ల రద్దు ప్రభావం మార్కెట్‌ను వెంటాడుతుంది. కాసుల గలగల లేదు. సరుకు కొనే వారు కరువయ్యారు. దించుకున్న సరుకులు దిగాలుగా వ్యాపారుల వంక చూసే వాతావరణం మార్కెట్‌లో కనపడింది. జిల్లాకు తల్లిసంతగా పేర్కొనే తాడేపల్లిగూడెం సంత పరిస్దితి ఇది. ఐదు వారాలుగా ఇదే తంతు. రూపాయి వ్యాపారానికి పావలా వ్యాపారం సాగుతోంది. కొన్న సరుకులు దుకాణాలపై వదిలే సంకటస్దితి పెద్దనోట్ల రద్దు. కొత్త రెండువేల రూపాయల నోట్లు మాత్రమే చలామణిలోకి రావడం, కొత్త 500, 100 రూపాయల నోట్లు చలామణిలో లేక వినియోగదారులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మ«ధ్యాహ్నం 12 గంటల సమయానికి సంతలో తప్పుకొనే వీలులేకుండా రద్దీగా ఉండేది. అలాంటిది ఆదివారం సంత బోసిపోయి కనిపించింది కూరగాయలు. చేపలు. మాంసం. ఎండు చేపల మార్కెట్ వెలవెలబోయి కనిపించింది. సరుకులు కొనే వారు రావడంలేదు. కొనడానికి వచ్చినా కూడా రెండు వేల రూపాయల నోటు తీసుకు వస్తున్నారు. చిల్లర ఇవ్వాలంటే నరకం కనిపిస్తోంది. సంత అవసరాలకు చిల్లర నోట్లు సమకూర్చి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. నిండుగా ఉండే సంత నీరసించి కనపడింది. పరిస్దితి ఇలాగే ఉంటే సంతకు సెలవు ప్రకటించాలేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement