
ఉసురు తీసిన వేధింపులు
అదనపు కట్నం కోసం ఒత్తిళ్లు...
గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులు మరో యువతి ఉసురు తీశాయి. మెట్టినింటి వారి నుంచి పెరుగుతున్న వేధింపులు.. ఛీత్కారాలు భరించలేక ఆ యువతి పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన పది నెలలకే మృత్యుఒడికి చేరింది. ఈ ఘటన కూడేరు మండలం ముద్దలాపురంలో మంగళవారం జరిగింది.
కూడేరు (ఉరవకొండ) : ముద్దలాపురానికి చెందిన గొల్ల నారాయణస్వామి, నరసమ్మ దంపతుల ఏకైక కుమార్తె గొల్ల శ్వేత లక్ష్మి(23)కి ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి కుమారుడు రమేష్‌తో 2016 మార్చి 18న వివాహమైంది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారు, రూ.లక్ష నగదు కట్నకానుకల కింద అందజేశారు. రమేష్ ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్. ఇతనికి పద్మావతి, తులసితో పాటు మరో అక్క ఉన్నారు. రెండు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత నుంచి తల్లి, అక్కల మాట విని రమేష్ అదనపు కట్నం కోసం శ్వేతలక్ష్మిని వేధించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో శ్వేతలక్ష్మి గర్భం దాల్చింది. అదనపు కట్నం మోజులో పడిన మెట్టినింటి వారు బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించారు. డబ్బు, బంగారం అదనంగా తీసుకొస్తావా లేదా అంటూ ఇబ్బందులకు గురి చేసేవారు. తినే అన్నం ప్లేటును లాక్కొని మరీ హింసించేవారు.
పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ
అదనపు కట్నం విషయాన్ని శ్వేతలక్ష్మి తన పుట్టింటి వారికి తెలిపింది. మరో 9 తులాల బంగారు, రూ.లక్ష నగదు ఇస్తేనే తాను సంతోషంగా మెట్టినింటిలో ఉండగలను అని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మెట్టినింటి వారితో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అయితే కొద్దిరోజులకే తిరిగి మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ‘వేరే చోట ఎక్కువ కట్నం ఇస్తామన్నా నిన్ను తక్కువ కట్నంతో చేసుకున్నాం. అదనంగా కట్నం తీసుకురాల్సిందే’నని మెట్టినింటి వారు పట్టుపట్టారు. ఇలానే కొద్దిరోజులు గొడవలతోనే కాపురం జరుగుతూ వచ్చింది.
మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
వేధింపులు ఎక్కువ కావడంతో నాలుగు నెలల క్రితం అనంతపురంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి శ్వేతలక్ష్మి పుట్టింట్లోనే ఉంటోంది. గొడవలు లేకుండా కాపురం చేసుకోవాలని పోలీసులు రమేష్‌కు సూచించారు. కానీ అతడు కాపురానికి మాత్రం తీసుకెళ్లలేదు.
ఆశలు ఆవిరయ్యాయి
వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనవడం, అదనపు కట్నం మోజులో పడి భర్త తనను కాపురానికి తీసుకెళ్లకపోవడం, బలవంతంగా గర్భస్రావం చేయించడంపై శ్వేతలక్ష్మి మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటి పక్కనే ఉన్న బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత తల్లి వచ్చినప్పటికీ అప్పటికే శ్వేతలక్ష్మి మృతి చెంది ఉంది. సీఐ శివనారాయణస్వామి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.