ఇంజనీరింగ్ చదువుకున్నారు. తల్లిదండ్రులను ఎదురించి కోరుకున్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు వివాహితల జీవితాలు అర్ధంతరంగా ముగియడానికి కారణాలు ఏమిటి.? బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారా? లేక నమ్మినవారి చేతిలో హతమయ్యారా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. సాంకేతిక విప్లవంగా చెప్పుకుంటున్న సెల్‌ఫోన్ ఇద్దరి జీవితాల్లో కల్లోలానికీ, చివరికి వారి ప్రాణాలను బలితీసుకుందనే అనుమానాలువ్యక్తం అవుతున్నాయి.
కోదాడ: కోదాడలో సోమవారం వెలుగుచూసిన వేర్వేరు సంఘటనల్లో అనుమానాస్పదంగా మృతిచెందిన వెంపటి జయశ్రీ (24) మాధవి (23)ల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాలు, నేపథ్యం వేరైనప్పటికీ ఇద్దరి మరణానికి కారణం ఒకటేనని తెలుస్తోంది. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాల వద్ద జయశ్రీ తల్లి ధనలక్ష్మి మాత్రం తన కుమార్తెను భర్త శ్రావణ్, అత్త మామలు వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. మాధవి భర్త సతీష్ కూడా వంశీకృష్ణ వేధించి తనభార్యను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
ప్రాణాలమీదకు తెచ్చిన సెల్‌ఫోన్...
కోదాడలో ఇంజనీరింగ్ చదువుకున్న జయశ్రీ పట్టణానికి చెందిన శ్రావణ్‌ను ప్రేమించి..పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. చదువుకునే రోజుల్లో క్లాస్‌మేట్ అయిన ఓ మిత్రుడు బెంగళూరులో ఉంటున్నాడు. ఇటీవల అతను తరచు జయశ్రీతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై భర్తకు జయశ్రీకి చిన్నపాటి గొడవలు అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని తరచు వేధిస్తున్నాడని ఆమె తల్లి పేర్కొంటోంది. అంతే కాక విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం జయశ్రీతో ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తికి శ్రావణ్ ఫోన్ చేసి ఇక తన భార్యకు ఫోన్ చెయ్యవద్దని వార్నింగ్ ఇవ్వడమేగాక కోదాడలో ఉంటున్న అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణల రికార్డు తనవద్ద ఉందని శ్రావణ్ తరుచు బెదిరిస్తున్నాడని జయశ్రీ తల్లిదండ్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో జయశ్రీ ఒత్తిడికి లోనైందా? లేక ఇతర కారణాలు ఏమై ఉంటాయన్నది పోలీసుల విచారణలో తేలనుంది. తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వరకట్నం కోసం వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జయశ్రీ కాపురంలో ఇంత కల్లోలానికి, ప్రాణాల మీదకురావడానికి సెల్‌ఫోనే కారణమని బంధువులు అంటున్నారు.
మాధవి మరణానికి కూడా..?
కోదాడలోని షిర్డీనగర్‌లో సోమవారం వెలుగుచూసిన మాధవి అనుమానాస్పద మరణం వెనుక కూడా సెల్‌ఫోన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. వత్సవాయికి చెందిన మాధవి ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్‌తో నెలన్నర క్రితమే వివాహం చేసుకుంది. ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే ఉన్నాయని తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా కష్టపడి పైకి వచ్చి, విద్యుత్ ఏఈ ఉద్యోగం సంపాదించిన సతీష్‌నే పెళ్లి చేసుకుంటానని కోరి చేసుకుందని బంధువులు అంటున్నారు. కానీ చదువుకునే రోజుల్లో పరిచమైన వంశీకృష్ణతో గతంలో తరచు ఫోన్‌లో మాట్లాడింది. వాటిని అడ్డుపెట్టుకుని మాధవిని వేధించడమేగాక ఫోన్ సంభాషణలను భర్తకు పంపుతానని బెదిరించాడని, దాని విషయం మాట్లాడడానికే ఆమె కోదాడకు వచ్చి ఉంటుందని బంధువులు అంటున్నారు. భర్త సతీష్ మాత్రం వంశీకృష్ణ వేధిస్తున్నాడని తనకు కూడా చెప్పిందని, అతనిపై గతంలో కేసు కూడా పెట్టిందని అంటున్నాడు. తన భార్య హత్యకు వంశీకృష్ణ కారణమని అతను ఆరోపిస్తున్నాడు. ఇదీలా ఉండగా సోమవారం కోదాడకు వచ్చిన మాధవి తన మరిదిని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ఉండమని ఆటోలో షిర్డీనగర్‌కు వెళ్లింది. అక్కడ వంశీకృష్ణ ఒక్కడే ఉన్నాడని ఫోన్ విషయమై వారు గొడవ పడుతుండగా అతని భార్య వచ్చిందని.. దీంతో తగాదా పెద్దదై భార్యభర్తలు కలిసి మాధవిని హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాధవి చనిపోయిన గదిలో ఫ్యాన్‌కూడా లేదని, చున్ని ఆమె బరువును కూడా ఆపదని అందువల్ల ఆత్మహత్య కానే కాదని.. అది ముమ్మాటికీ హత్యేనని బం«ధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద రోదిస్తూ ఆరోపించారు.
పోస్టుమార్టానికి వైద్యుడు కరువు..!
సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇద్దరు వివాహితలు జయశ్రీ, మాధవిల మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యుడు కరువయ్యాడు. సోమవారం రాత్రి మృతదేహాలను మార్చురీకి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వైద్యుడు లేకపోవడంతో బం«ధువులు మార్చురీ వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు మృతదేహాలను హుజూర్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి సాయంత్రం కావడంతో మృతుల కుటుంభ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
విచారణ జరుపుతున్నాం..
జయశ్రీ, మాధవి మరణాల మిస్టరీని ఛేదించేందుకు విచారణను ముమ్మరం చేశాం. జయశ్రీని వరకట్నం కోసమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రి ఫిర్యాదు చేశారు. మాధవి మృతిపై కూడా ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మాధవి విషయంలో సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశాం. సాధమైనంత త్వరలో ఈ కేసుల మిస్టరీని ఛేదిస్తాం.
–సీఐ రజితారెడ్డి, కోదాడ
Comments
Please login to add a commentAdd a comment