కాదన్నందుకు కడతేర్చాడు.. | marrital dispure leads murder in nizamabad | Sakshi
Sakshi News home page

కాదన్నందుకు కడతేర్చాడు..

Published Sun, Apr 2 2017 1:29 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

కాదన్నందుకు కడతేర్చాడు.. - Sakshi

కాదన్నందుకు కడతేర్చాడు..

నిజామాబాద్, వర్ని(బాన్సువాడ):
వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. కోరిక తీర్చలేదనే కోపంతో గొడ్డలితో హతమార్చాడు. అడ్డువచ్చిన భర్తపైనా దాడి చేసి పారిపోయాడు.. కలకలం రేపిన ఈ ఘటన వర్ని మండలం జాకోరాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జాకోరా గ్రామానికి చెందిన కుంచెపు సాయవ్వ(40) భర్త నాగయ్య జీవనోపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాగని చిన్నసాయిలుతో సాయవ్వకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరునెలల క్రితం నాగయ్య దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

నెలరోజుల క్రితం పెద్ద కుమారుడు సురేశ్‌ వివాహం చేశారు. ఈ నేపథ్యంలో సాయవ్వ సాయిలుతో దూరంగా ఉంటూ వచ్చింది. శుక్రవారం రాత్రి సాయిలు మద్యం సేవించి సాయవ్వ ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించడంతో వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆరు బయట భర్త నాగయ్యతో పాటు నిద్రిస్తున్న సాయవ్వ వద్దకు వచ్చి గొడ్డలితో మెడపై, చాతిపై కొట్టి దారుణంగా హతమార్చాడు. అడ్డువచ్చిన సాయవ్వ భర్తపై గొడ్డలితో దాడి చేశాడు. అలికిడికి చుట్టుపక్కల వారు నిద్రలేవడంతో పారిపోయాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ అంజయ్య ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. శనివారం ఉదయం బోధన్‌ రూరల్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చుట్టు పక్కల వారిని ప్రశ్నించి హత్య వివరాలు తెలుకున్నారు. హంతకుడు సాయిలు గతం నుంచే నేర ప్రవత్తి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సొంత భార్యతో తరుచూ గొడవపడే వాడని స్థానికులు పేర్కొన్నారు. దీంతో పదేళ్ల క్రితం ఆమె పుట్టిళ్లు మొగిలిపేట వెళ్లగా, అక్కడికి వెళ్లి భార్య గొంతు కోసి హత్యాయత్నం చేసినట్టు తెలిపారు.

అనంతరం సాయవ్వతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె వద్ద డబ్బులు డిమాండ్‌ చేసే వాడని తెలుస్తోంది. సాయవ్వ కుమారుడి పెళ్లి చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రెండు రోజుల క్రితం పైపులు విక్రయించి వివాహం సమయంలో చేసిన ఉద్దెర బాకీలను తీర్చింది. ఈ డబ్బులు సైతం ఇవ్వాలని సాయిలు ఆమెను డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయమై కూడా కక్ష కట్టిన సాయిలు హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement