⇒ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్
గుంటూరు : నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని బ్రాడీపేట ఎస్‌హెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల వ్యవధిలో ప్రభుత్వ శాఖల్లో ఏ ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్ళుగా ఒక్క నోటిఫికేషన్ రాకపోవడంతో రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వయో పరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హత కోల్పోయి ఎంతో మంది తీవ్ర మనోవేదనతో ఉన్నారని చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాలని, నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు అధికరాంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగులను నడిరోడ్డుపై నుంచోపెట్టారని విమర్శించారు. విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా, ప్రైవేటు వర్శిటీలను ప్రోత్సహించడం సరికాదన్నారు.
గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటనలు చేస్తూ కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదని ఆరోపించారు. అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బ్లూ ప్రింట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.45 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేబినెట్ ఆమోదించడంపై ఆయన ప్రశ్నించారు. జేఎల్, డీఎల్ పోస్టులతో పాటు సీఆర్‌డీఏ పరిధిలోని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ చెలగాటం
Published Fri, Sep 30 2016 7:35 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement