చీటీలు కావాలా.. సబ్జెక్టుకు రూ.వెయ్యి..? | mass cheating in inter exams at nalgonda district | Sakshi
Sakshi News home page

చీటీలు కావాలా.. సబ్జెక్టుకు రూ.వెయ్యి..?

Published Mon, Mar 14 2016 1:22 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

చీటీలు కావాలా.. సబ్జెక్టుకు రూ.వెయ్యి..? - Sakshi

చీటీలు కావాలా.. సబ్జెక్టుకు రూ.వెయ్యి..?

వేలంపాటలా మారిన ఇంటర్ పరీక్షలు
నల్లగొండ, హుజూర్‌నగర్, భువనగిరి, సాగర్ తదితర ప్రాంతాల్లో మాస్ కాపీయింగ్
ఇంటర్ బోర్డు అధికారులు సూర్యాపేటకే పరిమితం
► బుధవారంతో ముగియనున్న పరీక్షలు
 

నల్లగొండ: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వేలంపాటలా మారాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే రూ.వెయ్యి ముట్టజెప్పాల్సిందే..! గత కొద్దిరోజుల నుంచి నల్లగొండ పట్టణంలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. సూర్యాపేట పట్టణంలో గణితం ప్రశ్నపత్రం లీకైందన్న వార్తల నేపథ్యంలో బోర్డు అధికారులు జిల్లాలోనే తిష్టవేశారు. కానీ వారి తనిఖీలు మాత్రం కేవలం సూర్యాపేట, ఆత్మకూరులోని పరీక్ష కేంద్రాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని 108 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. దీంట్లో సమస్యాత్మక కేంద్రాలు, ఏ,బీ పరీక్షల కేంద్రాలు కూడా ఉన్నాయి.

విద్యార్థుల నుంచి బలవంతపు వసూళ్లు..?
నల్లగొండలోని పలు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చీటీలు అందాలన్నా.. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలన్నా సబ్జెక్టుకు రూ.వెయ్యి ముట్టజెప్పాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి పట్టణంలోని పలు ప్రైవేటు కాలేజీలు ఈ రకమైన దందాను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పాటు నాగార్జునసాగర్, హాలియా, హుజూర్‌నగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, సంస్థాన్ నారాయణపూర్ తదితర ప్రాంతాల్లోని కాలేజీల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కాలేజీలపై కనీసం కన్నెత్తి కూడా చూడని అధికారులు, కేవలం సూర్యాపేట పట్టణాన్నే కేంద్రంగా చేసుకుని విస్తృత దాడులు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జరగనున్న ఫిజిక్స్, ఆర్థిక శాస్త్రం, రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు అత్యంత ప్రధానమైనవి. కావున ఈ పరీక్షల్లో కాపీయింగ్ జరిగే ఆస్కారం ఉందని ప్రభుత్వ అధ్యాపకుడు ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
 
కనిపించని 144 సెక్షన్....
పరీక్షల సమయంలో పరీక్షకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న సంఘటనలకు పొంతన లేకుండా ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు తెరిచి ఉంచడానికి వీల్లేదు. కానీ నల్లగొండ పట్టణంలో బాలుర, బాలికల జూనియర్ కాలేజీల సమీపంలోని దుకాణాలు తెరిచే ఉంచుతున్నారు. సూర్యాపేట సంఘటనతో స్పందించిన అధికారులు జిల్లాలోని 108 కేంద్రాల జోలికి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ సారి పరీక్షల్లో 9 సమస్యాత్మక కేంద్రాలు, 5 ఏ,బీ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల వైపు బోర్డు అధికారులు దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement