
వైభవంగా మస్తానయ్య గంధం
గుంతకల్లు : పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడురోజుల పాటు జరిగే మస్తాన్‌వలి (మస్తానయ్య) 381వ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గురువారం వేకువజామున స్వామివారి గంధ ఉత్సవం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన గంధం పల్లెంను మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు.
పాత గుంతకల్లులోని పక్కీర్లవీధి, కుమ్మరకట్టవీధి, కచేరికట్ట, ఊరివాకిలి మీదుగా దర్గా వరకు గంధం ఊరేగింపు సాగింది. దర్గా ముజావర్లు (మస్తానయ్య సమాధి) ప్రతి రూపాన్ని గంధంతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల ఉంచి అశేష భక్తజనం విచ్చేయడంతో సందడి ఏర్పడింది. ఉత్సవం సందర్భంగా దర్గా ప్రాంగణం, పరిసరాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.