పర్యావరణ హితం ప్రతి ఒక్కరి బాధ్యత
అనంతపురం కల్చరల్: మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆ మేరకు కృషి చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన సరోజినీరోడ్డులోని శ్రీపాద కాంప్లెక్స్ ఆవరణలో హిందూ ధార్మిక ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరవాసులు భారీ సంఖ్యలో హాజరై విగ్రహాలు తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ధర్మప్రచార మండలి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరి, డాక్టర్ నారాయణ, సోమనాథ్ పాల్గొన్నారు. అలాగే ప్రముఖ యోగా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోనూ ఉచిత మట్టి వినాయకుల పంపిణీ జరిగింది. యోగా శిక్షకులు పొడమల రమేష్‌బాబు, మమత తదితరులు పర్యావరణాన్ని పాడు చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడబోమని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
అనంతపురం సప్తగిరి సర్కిల్: పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సాయి అప్న డ్రైవింగ్ స్కూల్ వారు తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను గురువారం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పంపిణీ చేశారు.