నిరుద్యోగ భృతిపై బాబును నిలదీస్తాం
- ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి
బనగానపల్లె: నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబును నిలదీస్తామని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుంచి 75శాతం వైఎస్‌ఆర్‌సీపీకే ఓట్లు లభించడంతో అందుకు సహకారం అందించిన వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డిని ఆయన స్వగృహంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని టీడీపీ అధినేత మరిచారన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే 13 జిల్లాల్లో లక్షమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వెనుబడిన రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌పీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మంచి మెజార్టీతో విజయం సాధించారన్నారు. వైఎస్సార్‌సీపీని ఆదరించిన పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.