- షెడ్యూలు ఖరారు చేసిన ప్రభుత్వం
- ఈ నెల 12 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు
- 27న ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులు
- ఈ నెల 13 నుంచి టెట్ హాల్‌టికెట్లు
- జూన్ 1న ఫలితాలు
- మీడియాతో డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల వాయిదా పడిన ఎంసెట్, టెట్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ నెల 15న ఎంసెట్, 22న టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ తేదీలను ఖరారు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్ తనిఖీల నిర్ణయాన్ని ఉపసంహరించే వరకు టెట్, ఎంసెట్ నిర్వహణకు సహకరించబోమని, ప్రైవేటు విద్యా సంస్థల బంద్‌ను కొనసాగిస్తామని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ప్రకటించడంతో ఈనెల 1న జరగాల్సిన టెట్, 2న జరగాల్సిన ఎంసెట్‌ను ప్రభుత్వం వాయిదా వేయడం తెలిసిందే.
ఈ పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించాలని కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆయన తాజా షెడ్యూలును ఖరారు చేశారు. అనంతరం కడియం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని...అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం ఆన్‌లైన్‌లోనూ (539 మంది దరఖాస్తు చేసుకున్నారు) అదేరోజు అదే సమయంలో పరీక్షను హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వ సిబ్బందితోనే పరీక్షను నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థులు ఈ నెల 12 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కడియం చెప్పారు. ఇంజనీరింగ్ కోసం 1,44,501 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 1,01,987 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను ఈ నెల 27న ప్రకటిస్తామన్నారు. గతంలో పేర్కొన్నట్లుగానే జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టి పూర్తి చేసి జూలై 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభిస్తామన్నారు. విద్యా సంవత్సరం విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందక్కర్లేదన్నారు.
టెట్‌కు 1,200 పరీక్ష కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 3.73 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న టెట్‌ను ఈ నెల 22న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్-1 పరీక్షను... అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహిస్తామని కడియం చెప్పారు. అభ్యర్థులంతా ఈ నెల 13 నుంచి 22 వరకు వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఫలితాలను జూన్ 1న విడుదల చేస్తామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాల్లో టెట్‌కు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే దాదాపు 1,200 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సిబ్బందితోనే ఈ పరీక్షనూ నిర్వహిస్తామన్నారు.
371 (డీ) ఉన్నందుకే నీట్ వద్దంటున్నాం...
రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించిన 371 (డీ) నిబంధన ఉన్నందువల్ల నీట్‌ను తెలంగాణకు వద్దంటున్నామని కడియం చెప్పారు. ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో హియరింగ్ ఉందని...తుది తీర్పును బట్టి ముందుకు వెళతామన్నారు. 371 (డీ) ఉన్నా నీట్‌ను అమలు చేయాలని చెబితే కోర్టు తీర్పును గౌరవిస్తామని...అప్పుడు ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని కడియం పేర్కొన్నారు.
తెలంగాణ వాటా కాపాడుకునేందుకే ప్రాజెక్టులు
రాష్ట్రానికి కృష్ణా, గోదావరిలో దాదాపు 1,300 టీఎంసీల వాటా ఉందని... ఆ మేరకే ప్రాజెక్టులు కడుతున్నామని కడియం పేర్కొన్నారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన మూడు ప్రధాన అంశాల్లో నీళ్లు ఒకటని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేస్తామంటోంది.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కడియం పైవిధంగా బదులిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని...వారికి ఆ స్వాతంత్య్రం ఉందని కడియం వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి, పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
వాటిల్లో జూలై 31లోగా సదుపాయాలు
రాష్ట్రంలోని 1,350 ప్రభుత్వ విద్యాసంస్థల్లో జూలై 31లోగా అన్ని సదుపాయాలు కల్పించాలని నిర్ణయించామని కడియం తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. 391 కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, 187 మోడల్ స్కూళ్లు, 35 విద్యాశాఖ గురుకులాలు, 12 మైనారిటీ, 134 సోషల్ వెల్ఫేర్, 36 ట్రైబల్ వెల్ఫేర్, 21 బీసీ వెల్ఫేర్ గురుకులాలు, 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 78 డిగ్రీ, 54 పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న 5 లక్షల మంది విద్యార్థులకు టాయిలెట్లు, మంచినీరు, ఆర్‌వో ప్లాంట్లు, కాంపౌండ్ వాల్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చే స్తామన్నారు. ఇకపై బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కడియం పేర్కొన్నారు.
15న ఎంసెట్.. 22న టెట్
Published Tue, May 3 2016 2:41 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM
Advertisement
Advertisement