
తరాలు మారినా.. మారని తలరాత
♦ పెరగని వేతనాలు.. కరువైన భద్రత
♦ దీనావస్థలో కార్మికుల ‘బతుకులు’
♦ నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం
తాండూరు రూరల్/జవహర్‌నగర్: తరాలు మారినా.. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాత మాత్రం మారడం లేదు. ఎన్నోఏళ్లుగా పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడంలేదు. శ్రమదోపిడీకి గురవుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో మూడు ప్రధానమైన సిమెంట్ ఫ్యాక్టరీలు, 500లకు పైగా నాపరాతి గనులు, 600లకు పైగా నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. మూడు సిమెంట్ ఫ్యాక్టరీల్లో 600లకు పైగా పర్మినెంట్ ఉద్యోగులు, 3వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారింది. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన ‘కోల్‌మిల్’ వద్ద నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నారు.
రాష్ట్రం వచ్చినా అంతే..
తెలంగాణ ప్రభుత్వంలో కార్మికుల బతుకులు మారుతాయని ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టు కార్మిక వ్యవ స్థే తెలంగాణలో లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కపట ప్రేమను చూపిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలగానే ఈఎస్‌ఐ ఆస్పత్రి..
వ్యాపార పరంగా పేరుగాంచిన తాండూరు ప్రాంతంలో కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్న ఈఎస్‌ఐ ఆస్పత్రి కాగితాలకే పరిమితమైంది. పది సంవత్సరాలుగా తాండూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది.
కనీస వేతనం కరువు..
ఓగిపూర్, మల్కాపూర్ గ్రామ శివార్లలో 500లకు పైగా నాపరాతి గనులు ఉన్నాయి. ఇక్కడ సూర్యోదయంతోనే వడ్డెరబస్తీలో సందడి నెలకొం టుంది. కూలి పనులు కోసం వడ్డెరులు ప్రతి రోజు వందల సంఖ్యలో నాపరాతి గనులకు వెళ్తుంటారు. గనుల్లో కనీస వేతనం కూడా యాజమాన్యాలు చెల్లించడం లేదని వడ్డెర సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రమాదకరమైన నాపరాతి గనుల్లో పని చేస్తే.. కనీసం రోజు వారి కూలీ గిట్టడం లేదని వాపోతున్నారు.