బూర్గుపల్లిలో మాంసం విక్రయాలు
గాంధీ జయంతి రోజు జోరుగా మాంసం, మద్యం విక్రయాలు
పట్టించుకోని అధికారులు
మెదక్ రూరల్: అహింసా మార్గంలో నడిచి తెల్ల దొరల చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహ పెకిలించి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా కృషి చేసిన జాతిపిత మహత్మాగాంధీ పుట్టిన రోజున జోరుగా మాంసం, మద్యం విక్రయాలు కొనసాగాయి. దీనిని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
జీవహింస మహపాపం, అహింస చేయరాదన్న మహత్మాగాంధీ సిద్ధాంతానికి తూట్లు పొడిశారు. ఈ తతంగం అంతా గ్రామాల్లో బహిరంగంగానే జరిగినా అధికారులు, ప్రజాప్రతినిదులు పట్టించుకోక పోవడం గమనార్హం. స్వాతంత్య్రోధ్యమంలో ముఖ్యపాత్ర వహించి అహింసా మార్గంలో నడిచి 200ఏళ్లుగా భారతదేశాన్ని పాలించిన బ్రిటీష్ దొరల బానిసత్వపు చెరసాల నుంచి కాపాడిన మహత్మగాంధీ పుట్టినరోజున ఆయన ఆదర్శాలను గంగలో కలిపారు.
మెదక్ మండలంలోని కూచన్‌పల్లి, బూర్గుపల్లి, సర్ధనతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచే మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. దీంతో పాటు ఆయా గ్రామాల్లో గల బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరిగాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని యావత్ దేశానికే సెలవు ప్రకటించి ఏ జీవిని చంపకూడదని, మద్యం విక్రయించరాదు, సేవించరాదని అధికారులు ప్రకటించినప్పటికీ ఆచరనలో మాత్రం ఎక్కడా అమలు కావడంలేదు.
ఏడాదికోసారి మహత్ముడి జయంతిని పురçస్కరించుకుని తూతూమంత్రంగా గాంధీ చిత్రపటానికి, విగ్రహలకు పూలమాల వేస్తున్నారు తప్ప ఆయన ఆశయాలను మన నేతలు ఎక్కడా అమలు పరచడంలేదు. అలాగే మండల పరిధిలోని హవేళిఘణాపూర్ శివారులోని గల మెదక్-బోధన్ ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఓ దాబాలో ఉదయం నుంచే యథేచ్చగా మద్యాన్ని సేవిస్తున్నారు.
పట్టణానికి పట్టుమని 5కిలో మీటర్ల దూరంలేని ఈ ప్రాంతాల్లో మాంసం, మద్యం విక్రయాలు జోరుగా కొనసాగినప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి గాంధీజీ కలలు కన్న ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.