మెదక్‌లో భగ్గుమన్న విపక్షం | Medak opposition bhaggumanna | Sakshi
Sakshi News home page

మెదక్‌లో భగ్గుమన్న విపక్షం

Published Fri, Sep 2 2016 7:42 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మెదక్‌లో భగ్గుమన్న విపక్షం - Sakshi

మెదక్‌లో భగ్గుమన్న విపక్షం

  • అతిచిన్న జిల్లా ఏర్పాటుపై నిరసన
  • గంటపాటు రాస్తారోకో
  • భారీగా నిలిచిన వాహనాలు
  • మద్దతు పలికిన న్యాయవాదులు
  • 24 మండలాలతో జిల్లా కావాలని డిమాండ్‌

  • మెదక్‌:మెదక్‌ను అతి చిన్న జిల్లాగా ఏర్పాటుకు సన్నాహాలు చేయడంపై ఈ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. ఒకప్పుడు సుభాగా వెలుగొందిన మెదక్‌ జిల్లాకు నాడు సమైక్య రాష్ట్రంలో పాలకులు అన్యాయం చేస్తే... నేడు స్వరాష్ట్రంలోనూ అదే అన్యాయం కొనసాగుతోందంటుఆన్నరు. కేవలం 14 మండలాలతో జిల్లాను సరిపెట్టడంపై విపక్షాలు నిరసన గళమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జిల్లా కేంద్ర సాధన సమితి, మెదక్‌ అభివృద్ధి పోరాట సమితి, కార్మిక, కుల సంఘాల నాయకులు శుక్రవారం మెదక్‌ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

    స్థానిక రాందాస్‌ చౌరస్తాలో ధూంధాం నిర్వహించారు. ఈ నిరసనకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 24 మండలాలతో కూడిన జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం సమర్పించారు.
    మెదక్‌కు తీరని అన్యాయమే...
    పాలకులు పథకం ప్రకారమే మెదక్‌ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు మండిపడ్డారు. ఐఐటీ, జేఎన్‌టీయూతోపాటు బీడీఎల్‌ వంటి పెద్ద సంస్థలు మెదక్‌ పేరిట మంజూరు కాగా వాటిని సంగారెడ్డి ప్రాంతంలో నెలకొల్పారన్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏవీ లేవన్నారు. మెదక్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... జిల్లా కేంద్ర సాధన కోసం రాందాస్‌ అనే సామాజిక కార్యకర్త నాలుగు దశాబ్దాల క్రితం 40రోజులపాటు నిరాహార దీక్షచేసి అమరుడయ్యాడన్నారు.

    అప్పట్లో పాలకుల నిర్లక్ష్యం వల్లే జిల్లా ఏర్పాటు కాలేదన్నారు. 18 మండలాలతో కూడిన రెవెన్యూడివిజన్‌ ఉన్న మెదక్‌ను 14మండలాలతో జిల్లా చేయడం ఏమిటని ప్రశ్నించారు. నర్సాపూర్, నారాయణఖేడ్, అందోల్‌ నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి మండలాన్ని సైతం మెదక్‌లో కలిపి ఈ జిల్లాకు ఓ స్వరూపం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

    ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ నాయకులు సురేందర్‌గౌడ్, మామిళ్ల ఆంజనేయులు, మధుసూదన్‌రావు, కిషన్‌గౌడ్, గూడూరి ఆంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, ముత్యంగౌడ్, జనార్దన్‌, మల్లేశం, జిల్లా కేంద్ర సాధన సమితి నాయకులు మల్కాజి సత్యనారాయణ, సుభాష్‌ చంద్రబోస్‌గౌడ్, గోవింద్‌రాజ్, జివ్వాజి విజయ్‌కుమార్, మ్యాప్స్‌ అధ్యక్షుడు హర్కార్‌ మహిపాల్, టీడీపీ నాయకులు బట్టి జగపతి, అఫ్జల్‌, మాణిక్యరెడ్డి, సీపీఎం, సీపీఐలతోపాటు పలు కుల సంఘాలు నాయకులు బాల్‌రాజ్, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement