ముగిసిన మేడారం జాతర..
► సమ్మక్క-సారలమ్మలను వనప్రవేశానికి తీసుకెళ్లిన పూజారులు
► మేడారం జాతర ముగిసినట్టు ప్రకటించిన అధికారులు
► మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్
► మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై కేసీఆర్ ఆనందం
► వరంగల్ కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు, సిబ్బందికి కేసీఆర్ అభినందనలు
వరంగల్: ఫిబ్రవరి 17 న ప్రారంభమై నాలుగు రోజులపాటు ఘనంగా జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర ముగిసింది. సమ్మక్క సారలమ్మలను వనప్రవేశానికి పూజారులు తీసుకెళ్లారు. దాంతో మేడారం జాతర ముగిసినట్టు శనివారం అధికారులు ప్రకటించారు. మేడారం జాతర చివరి రోజు కావడంతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై శనివారం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ జాతర నేపథ్యంలో రేయింబవళ్లు పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జాతర అద్భుతంగా జరిగిందని కొనియాడారు. వరంగల్ కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.
గత మూడు రోజులుగా మేడారం భక్తజనంతో మెరిసిపోయింది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఒకే చోట కొలువుదీరడం తో భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుని తన్మయత్వానికి లోనయ్యారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో రోజంతా రద్దీ కొనసాగింది. జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉన్నారు.
బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి మొక్కులు ఊపందుకున్నాయి. శుక్రవారం రాత్రి వరకు వన దేవతలను దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు తెలిపారు. రాజకీయ నేతలు, సినీ నటులు కూడా మేడారం జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకున్నారు.