అంత్యపుష్కరాల్లో నిరంతర వైద్య సేవలు
అంత్యపుష్కరాల్లో నిరంతర వైద్య సేవలు
Published Thu, Jul 28 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
ఘాట్లలో వైద్య శిబిరాలు, మొబైల్ అంబులెన్స్‌లు
జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు : టి.రమేష్‌కిషోర్
సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్య పుష్కరాల్లో భక్తులకు 12 రోజుల పాటు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం నగరంలో ఎంపిక చేసిన ఎనిమిది ఘాట్ల వద్ద 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా, bè త్తీస్‌గఢ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టుగా జిల్లా వైద్యాఆరోగ్యశాఖ, రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌లు ఏర్పాట్లు చేస్తున్నాయి.
∙నగరంలోని కోటిలింగాల ఘాట్, పుష్కరఘాట్, మార్కండేయస్వామి ఘాట్, గౌతమి ఘాట్‌ల వద్ద జిల్లా వైద్యఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఒక్కో శిబిరంలో వైద్యుడితోపాటు సిబ్బంది భక్తులకు వైద్య సేవలందించనున్నారు. వీరితోపాటు ఆయా ఘాట్లలో రెండు మొబైల్ అంబులెన్స్‌ల ద్వారా నిరంతర సేవలు కొనసాగనున్నాయి. ఒక్కో వాహనంలో నలుగురు వైద్యులతోపాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు.
∙ జిల్లా ఆస్పత్రిలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా 15 బెడ్లతో రెండు వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ఓపీతోపాటు అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా మరో ఓపీ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. భక్తులను ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ఒక అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. వీఐపీలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రిలో ఓ వైద్య బృందాన్ని నియమించనున్నారు.
∙స్థానికంగా ఉన్న వైద్యులతోపాటు కాకినాడ జీజీహె చ్ నుంచి రెండు వైద్య బృందాలు సేవలందించనున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అంత్యపుష్కరాల నేపథ్యంలో కావాల్సిన మందులు తెప్పించుకున్నామని రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్ తెలిపారు. భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా రెండు వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక వైద్యులతోపాటు కాకినాడ, అవసరమైతే స్థానిక ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగించుకోనున్నట్లు వివరించారు.
Advertisement