అమలాపురంలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
అమలాపురంలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
-హాస్టల్ గదిలో ఉరేసుకున్న వివేక్
అమలాపురం రూరల్ :
అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారం వివేక్ (23) కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని తోటి విద్యార్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గటానికి వివేక్ మందులు వాడుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. క్రమశిక్షణతో ఉండే వివేక్ చదువులో చురుగ్గానే ఉంటాడని, మితంగా మాట్లాడతాడని స్నేహితులు చెప్పారు. వివేక్ బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం నుంచి కళాశాల నుంచి వచ్చిన రూమ్‌మేట్స్ సాయికృష్ణ, శ్రీకాంత్ తలుపు గడియ వేసి ఉండటంతో ఎంత పిలిచినా స్పందించక పోవటంతో తలుపులు పగులగొట్టారు. వివేక్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. వివేక్‌ను కిందికి దింపి కిమ్స్ హాస్పటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, తాలూకా ఎస్సై ఎం.గజేంద్రకుమార్ వివేక్ ఉంటున్న హాస్టల్ గదిని, మృతదేహాన్ని పరిశీలించారు. ఈనెల 21 నుంచి నాలుగో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉందని, దాంతో ఎక్కువగా చదువుతున్నాడని స్నేహితులు చెబుతున్నారు. వివేక్ తండ్రి భాస్కరరెడ్డి చిత్తూరులో ఓ బ్యాంక్ రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ వివేక్ మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. వివేక్ ఆత్మహత్యకు ముందు తన వ్యక్తిగత ట్యాబ్‌లో ఉరి వేసుకోవడానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఆధారాలు కనిపించాయన్నారు. కిమ్స్ వైస్ చైర్మన్ మోహనరాజు వివేక్ మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.