ఫలించిన పోరాటం
►సుప్రీంకోర్టు నోటీసులతో సర్దుతామంటున్న రాష్ట్ర ప్రభుత్వం
►విద్యా సంవత్సరాన్ని కోల్పోనున్న బాధిత వైద్య విద్యార్థులు
►2017లో కొత్తగా 13 కళాశాలల్లో చేర్చనున్న వైనం
►99 మంది విద్యార్థులు ఏడాది కాలంగా ఉద్యమ బాట
►ఇక నుంచైనా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
కళాశాల యాజమాన్యం తీరుతో వంద మంది వైద్యవిద్యార్థులు మోసపోయారు. ఎన్నో వ్యయప్రయాసలతో సాధించుకున్న వైద్య విద్యకు ఎంసీఐ అనుమతి లేదని తెలిసి వారంతా రోడ్డునపడ్డారు. ఏడాది కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కలవని నేత లేరు.. కడప నుంచి ఢిల్లీ దాకా అవసరమైన అన్ని కార్యాలయాలకు వెళ్లారు. చివరకు ఆత్మహత్యలే తమకు దిక్కు అంటూ కళాశాల పైకెక్కారు. ఉద్యమబాటలో చివరకు న్యాయపోరాటం చేసి గెలిచారు. ఇదీ కడప సమీపంలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో సీట్లు పొందిన వైద్య విద్యార్థుల గాథ. సుప్రీంకోర్టు స్పందించి రాష్ట్రప్రభుత్వానికి, ఎంసీఐకి నోటీసులు పంపడంతో వారికి ఊరట లభించినట్లయింది. కానీ ఇతర కళాశాలలో సీట్లు వచ్చేనా? ఇకనైనా తమకు న్యాయం జరిగేనా? అని వారి తల్లిదండ్రులు కొంత సంశయంలో ఉన్నారు.
సాక్షి, కడప : కళాశాల యాజమాన్యం నమ్మించి మోసం చేసిన వ్యవహారంతో అటు తల్లిదండ్రులతోపాటు ఇటు విద్యార్థులు నరకయాతన అనుభవించారు. సుమారు 99మంది విద్యార్థులు ఫాతిమా మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందినా చివరకు అక్కడ ఎంసీఐ అనుమతి లేని నేపథ్యంలో ప్రతిరోజు వేదన అనుభవించాల్సి వస్తోంది. రోడ్డెక్కి ఉద్యమం చేస్తూనే మరోపక్క చేసిన న్యాయ పోరాటంతో వారికి వైద్య విద్య అభ్యసించేందుకు అవకాశం లభిస్తున్నా... అనవసరంగా ఏడాది కోల్పొయామన్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలోనైనా వారికి న్యాయం జరగాలని కోరుకుందాం.
విద్యా సంవత్సరాన్ని కోల్పొయిన విద్యార్థులు
ఫాతిమా మెడికల్ కళాశాలలో చేరి ఇబ్బందులు పడ్డ సుమారు 99 మంది విద్యార్థులు ఏడాదిపాటు విద్యా సంవత్సరాన్ని కోల్పోనున్నారు. అనుమతిలేక ఏడాదిన్నరకు పైగా పోరాటం చేస్తూ వచ్చిన వారికి ఓ రకంగా ఈ సంవత్సరం అవకాశం కల్పిస్తున్నా ఏడాది అనవసరంగా పోయిందన్న బాధ వెంటాడుతోంది. మరోపక్క ఉన్న విలువైన ఆస్తులను కుదవపెట్టి ఫీజుల రూపంలో రూ.లక్షలు సరైన సమయంలోనే కట్టినప్పటికీ విద్యా సంవత్సరం నష్టపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
మెడికల్ కళాశాలల్లో చేర్పించే సమయంలో తల్లిదండ్రులు కొంతైనా జాగ్రత్తలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫాతిమా విద్యార్థులకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మెడిసిన్ చదివే విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు కళాశాలకు సంబంధించి ఎంసీఐ గుర్తింపు ఉందా? సరైన ఫ్యాకల్టీ ఉన్నారా? రేటింగ్‌లో ఇండియా, ఏపీలో స్థానమెంత? ఏ గ్రేడ్‌లో ఉంది? సరైన సౌకర్యాలు ఉన్నాయా? లేదా? మెడికల్ కళాశాలకు సంబంధించి అనుబంధంగా ఆస్పత్రి ఉందా..లేదా? అక్కడి పరిస్థితులపై లోతుగా కొంత అధ్యయనం చేసి పిల్లలను చేర్చేందుకు సిద్ధపడాలి. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2017 ప్రకారం కళాశాలలో అడ్మిషన్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 99 మంది విద్యార్థులు 2015–16 సంవత్సరానికి సంబంధించి మెడిసిన్ చదివేందుకు కడప నగర శివార్లలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందారు. అయితే కళాశాలలో పది నెలల పాటు తరగతులు నిర్వహించారు. అయితే కళాశాలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి అనుమతి లభించకపోవడం రూ.లక్షల్లో ఫీజుల రూపంలో కట్టిన మొత్తాలు వెనక్కి రాకపోవడంతో అందరిలోనూ అలజడి ప్రారంభమైంది. కళాశాల ఎదుట మొదలైన ఆందోళన తర్వాత కడపలో రాస్తారోకో, కలెక్టరేట్ ఎదుట దీక్షల వరకు కొనసాగింది. చివరకు ఢిల్లీ వరకు ఆందోళన కథ నడిచింది. ఢిల్లీలో కూడా ప్రత్యేకంగా నిరసన దీక్షలు చేపట్టడంతోపాటు కేంద్రమంత్రులను సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఎంత పోరాటం చేసినా చివరకు విద్యార్థుల వేదనను సుప్రీంకోర్టు ఆలకించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వం వారికి 2017 విద్యా సంవత్సరంలో అవకాశం కల్పించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎట్టకేలకు వారికి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవకాశం లభించనుంది.