‘మేడిగడ్డ’కు 10,300 కోట్లు | 'Medigadda' to the 10,300 crore | Sakshi
Sakshi News home page

‘మేడిగడ్డ’కు 10,300 కోట్లు

Published Sat, Dec 5 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

‘మేడిగడ్డ’కు 10,300 కోట్లు

‘మేడిగడ్డ’కు 10,300 కోట్లు

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే పనులకు రూ. 10,300 కోట్ల వ్యయ అంచనాతో ప్రణాళిక సిద్ధమైంది. ఈ మార్గం లో మొత్తం 21.29 టీఎంసీల సామర్థ్యంతో 3 బ్యారేజీలు నిర్మిస్తారు. 4 లిఫ్టుల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకు 700 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేలింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీని 100 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్ర భూభాగంలో ముంపు ఉండనున్న దృష్ట్యా... ముంపు లేకుండా బ్యారేజీ ఎత్తును రెండు మూడు మీటర్లు తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సర్వే సంస్థ వ్యాప్కోస్ ముసాయిదా నివేదిక (డ్రాఫ్ట్)ను శుక్రవారం మంత్రి హరీశ్‌రావుకు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులకు అందజేసింది. ఈ నివేదికపై రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి... అనంతరం ముంపు సమస్యలపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు.

 రూ. 1,400 కోట్లు పెరిగింది..
 ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టికి బదులుగా... కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి కాలువల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాలువల మార్గంలో ఎన్టీపీసీలతో పాటు పర్యావరణ, అటవీ అడ్డంకులు ఉన్నందున.. గోదావరి ప్రవాహ మార్గాన్ని వాడుకోవాలని నిర్ణయించారు. దీనిపై నెల రోజులుగా లైడార్ సర్వే చేసిన వ్యాప్కోస్ ముసాయిదా నివేదికను శుక్రవారం అందజేసింది. దీని ప్రకారం.. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల పూర్తి స్థాయి నిల్వ ఎత్తు(ఫుల్ రిజర్వాయర్ లెవెల్-ఎఫ్‌ఆర్‌ఎల్)తో గరిష్టంగా 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తారు. దీని నుంచి 14 కిలోమీటర్ల దిగువన 120 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద అన్నారం వద్ద 3.52 టీఎంసీలతో బ్యారేజీ, మరో 25 కిలోమీటర్ల దిగువన 130 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల వద్ద 1.62 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ చేపడతారు.

ఈ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 10 నుంచి 20 మీటర్ల ఎత్తుతో నాలుగు లిఫ్టులు.. 700 మెగావాట్ల విద్యుత్ అవసరం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ. 3,400 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ. 1,600 కోట్లు, సుందిళ్లకు రూ. 1,400 కోట్లతో పాటు పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాలకు కలిపి రూ. 10,300 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే ప్రాజెక్టు ఆరంభించిన సమయానికి ఈపీసీ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం ఈ పనుల విలువ రూ. 8,900 కోట్లే. ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారమే చేయాల్సి ఉండటంతో వ్యయ అంచనా రూ.1,400 కోట్ల మేర పెరి గింది. ఈ నివేదికను పరిశీలన నిమిత్తం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)కుపంపా రు. అక్కడ మార్పులంటే ఈ వ్యయ అంచనాల్లోనూ మార్పులు జరిగే అవకాశముంది.
 
 మేడిగడ్డతో మహారాష్ట్రలో ముంపు
 మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో చేపట్టే బ్యారేజీతో రాష్ట్రంలో 500 ఎకరాలు, మహారాష్ట్రలో 400 ఎకరాల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. ఈ స్థాయి ముంపును మహారాష్ట్ర అంగీకరించే పరిస్థితి లేనందున.. బ్యారేజీ ఎత్తును % మీటర్లు తగ్గించాలని భావిస్తున్నారు. 100 నుంచి 97 మీటర్ల వరకు వివిధ ఎత్తులో ముంపు ఎలా ఉంటుందన్నది తేల్చాలని వ్యాప్కోస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో జలరవాణాకు వీలుగా బ్యారేజీల నిర్మాణ ప్రణాళిక తయారు చేయాలని సీడీవోకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement