Vyapkos
-
ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖ: సీఎం
సాక్షి, అమరావతి: ఫిన్‌టెక్ కంపెనీలకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆర్థిక సాంకేతికరంగ (ఫిన్‌టెక్) కంపెనీల సీఈవోలతో ఆయన గురువారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో హాజరైన పదిహేను దేశాల ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. విశాఖ, ముంబై మధ్య మరిన్ని విమాన సర్వీసులు నడపాలని సీఈవోలు కోరారు. కాగా, పట్టిసీమ ఎత్తిపోతల స్ఫూర్తితో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చెప్పారు. సచివాలయంలో జలవనరులపై సమీక్ష సందర్భంగా ‘వ్యాప్కోస్’ రూపొందించిన నాలుగు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చించి, నాలుగో దానికి ఆమోదముద్ర వేశారు. నాలుగో ప్రతిపాదనలో ‘పోలవరం జలాశయం ఎగువన 85 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను ఎత్తిపోసి 292 కిలోమీటర్లు కాలువ ద్వారా తరలించి కృష్ణాజిల్లా చెరుకుపాలెం వద్ద నిర్మించే అక్విడెక్టు ద్వారా కృష్ణా నదిని దాటించాలి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 360 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసి.. అక్కడి నుంచి సోమశిల, వెలిగొండ ఆయకట్టుకు తరలించాలి. సోమశిల, కండలేరు మీదుగా చిత్తూరు జిల్లాలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించవచ్చు’ అని వ్యాప్కోస్ ప్రతినిధులు వివరించారు. ఇందుకు రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. 13వ తేదీ ఉదయం 8 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. బడ్జెట్‌ను ఈ భేటీలో ఆమోదించనున్నారు. -
నెలాఖరులోగా ఆ ప్రాజెక్టుల నివేదికలివ్వండి
వ్యాప్కోస్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులోగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని వ్యాప్కోస్ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దేవాదుల, నార్లాపూర్, డిండి, కాంతానపల్లి, మల్కాపూర్ రిజర్వాయర్, తుమ్మిడిహెట్టి, మల్లన్నసాగర్ నుంచి సింగూర్ లింక్ తదితర సర్వే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి డీపీఆర్‌లు సమర్పించాలని తెలిపారు. వ్యాప్కోస్ త్వరితగతిన నివేదికలు సమర్పించేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయా ప్రాజెక్టులు, ప్యాకేజీలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి వ్యాప్కోస్ అధికారులు, సీఈలతో మంత్రి హరీశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. -
కాళేశ్వరానికి తుదిరూపు!
♦ మారిన డిజైన్ల మేరకు వ్యయ అంచనాలు సిద్ధం ♦ గత అంచనాల కంటే 18 వేల కోట్ల మేర పెరిగిన వ్యయం ♦ తుది నివేదిక సమర్పించిన వ్యాప్కోస్.. అంచనా రూ.4,231 కోట్లు ♦ అన్నిఅంశాలు కేబినెట్‌కు, మహారాష్ట్రతో చర్చల అనంతరం పనుల్లో వేగం సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలకు తుదిరూపునిచ్చే కార్యాచరణ వేగం పుంజు కుంది. మారిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌కు అనుగుణంగా వ్యయ అంచనాలు సిద్ధమవుతున్నాయి. 8 ప్యాకేజీల అంచనాలు ఇప్పటికే సిద్ధంకాగా ఆదిలాబాద్ జిల్లాకే పరి మితం చేసిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరందించే ప్రతిపాదనలను సర్వే సంస్థ వ్యాప్కోస్ సిద్ధం చేసింది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గం మధ్య నిర్మించనున్న 3 బ్యారేజీలకు ఈ నెల 7న టెండర్లు పిలిచేలా కసరత్తు సాగుతోంది. ఈ నెల 6న జరిగే కేబినెట్ సమావేశంలో మారిన డిజైన్లు, పెరిగిన అంచనాలకు ఆమోదం తెలపనున్నారు. 8న మహా రాష్ట్రతో కుదుర్చుకునే ఒప్పందంపై నీటి పారుదలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గోదావరి నీటిని మేడిగడ్డ దిగువన ఉన్న కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి పాతమార్గంలో మెదక్, నిజామాబాద్‌లకు తరలిం చేలా ప్రణాళిక ఇప్పటికే ఖారారైంది. ప్యాకేజీ 1 నుంచి 5 వరకు తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా, జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను గురువారం వ్యాప్కోస్ ప్రభుత్వానికి అందజేసింది. 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు అంచనా వ్యయం రూ. 4,231 కోట్లుగా తేల్చినట్లు సమాచారం. మరో 4 ప్యాకేజీల అంచనాలు సిద్ధం ఎల్లంపల్లి దిగువన ఉన్న 6, 8, 11, 12 ప్యాకేజీల అంచనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మొత్తంగా ఇక్కడ 4 ప్యాకేజీల వాస్తవ వ్యయం రూ.11,098 కోట్లు ఉండగా అది సవరించిన అంచనాలతో రూ.21,537.49 కోట్లకు చేరింది. గురువారం ప్యాకేజీ 13,14,15, 16 అంచనాల వ్యయాలను సిద్ధం చేశారు. ప్యాకేజీ14లో ఉన్న పాములపర్తి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచడంతో వ్యయం రూ. 659 కోట్ల నుంచి రూ. 4,990 కోట్లకు చేరింది. 7న మేడిగడ్డ టెండర్లు: మేడిగడ్డ-ఎల్లంపల్లిల మధ్య బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలకు ఇప్పటికే రూ.5,813 కోట్లతో అనుమతులిచ్చారు. వీటికి ఈ నెల 6న కేబినెట్లో చర్చించి 7న టెండర్లు పిలిచే అవకాశం ఉంది. 22కి టెక్నికల్ టెండర్లు తెరిచి, నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. టెండర్లు, మహారాష్ట్రతో ఒప్పందాలపై గురువారం అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. -
‘ప్రాణహిత’లో మరో 2 మినీ బ్యారేజీలు
ఎల్లంపల్లి-ఎస్సారెస్పీ మధ్య నిర్మించేలా సీఎం ప్రతిపాదన వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతల అప్పగింత హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నీటిని తరలించే క్రమంలో మూడు బ్యారేజీల నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం..తాజాగా ఎల్లంపల్లి-శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మధ్య మరో రెండు మినీ బ్యారేజీలను నిర్మించాలనే నిశ్చయానికి వచ్చింది. ప్రాణహితపై ఆదివారం సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మినీ బ్యారేజీల ప్రతిపాదనను తెచ్చి, వాటి నిర్మాణానికి అనువైన ప్రదేశాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గోదావరిపై వరుస బ్యారేజీల నిర్మించి.. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తేవాలని నిర్ణయించి, అందుకు తగ్గట్లు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ బ్యారేజీల నిర్మాణ పనులకు ఆదివారం సమీక్షలో సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇదే సందర్భంగా ఎల్లంపల్లి-ఎస్సారెస్పీ మధ్య అదనంగా మూడు బ్యారేజీల నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ఈ మార్గంలో ఇప్పటికే ఎస్సారెస్పీ దిగువన సదర్‌మఠ్ ప్రాంతం బ్యారేజీ నిర్మాణానికై ఇది వరకే నిర్ణయం జరగడం, దానికి సంబంధించి డీపీఆర్ సైతం సిద్ధమవుతున్న దృష్ట్యా కొత్తగా రెండు మినీ బ్యారేజీలు నిర్మించాలని సూచించారు. ఈ బ్యారేజీలను షట్టర్లతో నిర్మించాలని, వరద వచ్చినప్పుడు దిగువకు ప్రవాహాలు వెళ్లేలా, వరద తగ్గినప్పుడు షట్టర్లు మూసి 3 నుంచి 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక బ్యారేజీని ఎల్లంపల్లికి ఎగువన ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని జైనా వద్ద నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీని ఎగువన మరో బ్యారేజీ ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, వాటి సర్వే నివేదికలు తయారు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వ్యాప్కోస్‌కే కట్టబెట్టారు. -
‘మేడిగడ్డ’కు 10,300 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే పనులకు రూ. 10,300 కోట్ల వ్యయ అంచనాతో ప్రణాళిక సిద్ధమైంది. ఈ మార్గం లో మొత్తం 21.29 టీఎంసీల సామర్థ్యంతో 3 బ్యారేజీలు నిర్మిస్తారు. 4 లిఫ్టుల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకు 700 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేలింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీని 100 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్ర భూభాగంలో ముంపు ఉండనున్న దృష్ట్యా... ముంపు లేకుండా బ్యారేజీ ఎత్తును రెండు మూడు మీటర్లు తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సర్వే సంస్థ వ్యాప్కోస్ ముసాయిదా నివేదిక (డ్రాఫ్ట్)ను శుక్రవారం మంత్రి హరీశ్‌రావుకు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులకు అందజేసింది. ఈ నివేదికపై రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి... అనంతరం ముంపు సమస్యలపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. రూ. 1,400 కోట్లు పెరిగింది.. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టికి బదులుగా... కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి కాలువల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాలువల మార్గంలో ఎన్టీపీసీలతో పాటు పర్యావరణ, అటవీ అడ్డంకులు ఉన్నందున.. గోదావరి ప్రవాహ మార్గాన్ని వాడుకోవాలని నిర్ణయించారు. దీనిపై నెల రోజులుగా లైడార్ సర్వే చేసిన వ్యాప్కోస్ ముసాయిదా నివేదికను శుక్రవారం అందజేసింది. దీని ప్రకారం.. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల పూర్తి స్థాయి నిల్వ ఎత్తు(ఫుల్ రిజర్వాయర్ లెవెల్-ఎఫ్ఆర్ఎల్)తో గరిష్టంగా 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తారు. దీని నుంచి 14 కిలోమీటర్ల దిగువన 120 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద అన్నారం వద్ద 3.52 టీఎంసీలతో బ్యారేజీ, మరో 25 కిలోమీటర్ల దిగువన 130 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల వద్ద 1.62 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ చేపడతారు. ఈ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 10 నుంచి 20 మీటర్ల ఎత్తుతో నాలుగు లిఫ్టులు.. 700 మెగావాట్ల విద్యుత్ అవసరం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ. 3,400 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ. 1,600 కోట్లు, సుందిళ్లకు రూ. 1,400 కోట్లతో పాటు పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాలకు కలిపి రూ. 10,300 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే ప్రాజెక్టు ఆరంభించిన సమయానికి ఈపీసీ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్ఎస్ఆర్) ప్రకారం ఈ పనుల విలువ రూ. 8,900 కోట్లే. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ప్రకారమే చేయాల్సి ఉండటంతో వ్యయ అంచనా రూ.1,400 కోట్ల మేర పెరి గింది. ఈ నివేదికను పరిశీలన నిమిత్తం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)కుపంపా రు. అక్కడ మార్పులంటే ఈ వ్యయ అంచనాల్లోనూ మార్పులు జరిగే అవకాశముంది. మేడిగడ్డతో మహారాష్ట్రలో ముంపు మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో చేపట్టే బ్యారేజీతో రాష్ట్రంలో 500 ఎకరాలు, మహారాష్ట్రలో 400 ఎకరాల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. ఈ స్థాయి ముంపును మహారాష్ట్ర అంగీకరించే పరిస్థితి లేనందున.. బ్యారేజీ ఎత్తును % మీటర్లు తగ్గించాలని భావిస్తున్నారు. 100 నుంచి 97 మీటర్ల వరకు వివిధ ఎత్తులో ముంపు ఎలా ఉంటుందన్నది తేల్చాలని వ్యాప్కోస్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో జలరవాణాకు వీలుగా బ్యారేజీల నిర్మాణ ప్రణాళిక తయారు చేయాలని సీడీవోకు సూచించారు.