ఎల్లంపల్లి-ఎస్సారెస్పీ మధ్య నిర్మించేలా సీఎం ప్రతిపాదన
వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతల అప్పగింత
హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నీటిని తరలించే క్రమంలో మూడు బ్యారేజీల నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం..తాజాగా ఎల్లంపల్లి-శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మధ్య మరో రెండు మినీ బ్యారేజీలను నిర్మించాలనే నిశ్చయానికి వచ్చింది. ప్రాణహితపై ఆదివారం సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మినీ బ్యారేజీల ప్రతిపాదనను తెచ్చి, వాటి నిర్మాణానికి అనువైన ప్రదేశాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గోదావరిపై వరుస బ్యారేజీల నిర్మించి.. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తేవాలని నిర్ణయించి, అందుకు తగ్గట్లు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ బ్యారేజీల నిర్మాణ పనులకు ఆదివారం సమీక్షలో సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఇదే సందర్భంగా ఎల్లంపల్లి-ఎస్సారెస్పీ మధ్య అదనంగా మూడు బ్యారేజీల నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ఈ మార్గంలో ఇప్పటికే ఎస్సారెస్పీ దిగువన సదర్‌మఠ్ ప్రాంతం బ్యారేజీ నిర్మాణానికై ఇది వరకే నిర్ణయం జరగడం, దానికి సంబంధించి డీపీఆర్ సైతం సిద్ధమవుతున్న దృష్ట్యా కొత్తగా రెండు మినీ బ్యారేజీలు నిర్మించాలని సూచించారు. ఈ బ్యారేజీలను షట్టర్లతో నిర్మించాలని, వరద వచ్చినప్పుడు దిగువకు ప్రవాహాలు వెళ్లేలా, వరద తగ్గినప్పుడు షట్టర్లు మూసి 3 నుంచి 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక బ్యారేజీని ఎల్లంపల్లికి ఎగువన ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని జైనా వద్ద నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీని ఎగువన మరో బ్యారేజీ ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, వాటి సర్వే నివేదికలు తయారు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వ్యాప్కోస్‌కే కట్టబెట్టారు.
‘ప్రాణహిత’లో మరో 2 మినీ బ్యారేజీలు
Published Tue, Dec 22 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM
Advertisement
Advertisement