Pranahita chevella Project
-
కాళేశ్వరం నీళ్లు వచ్చేదెప్పుడు ?
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవపట్టించొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వివిధ రాజకీయ పక్షాలకు సూచించింది. ప్రాజెక్టు విషయంలో దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది. ప్రాజెక్టు పనులు కేవలం 15% మాత్రమే పూర్తయ్యాయని, అందుకు రూ.50వేల కోట్లు ఖర్చయ్యాయంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలు సరికాదని పేర్కొంది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 64% పూర్తవగా, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన నిర్మాణాల ఒప్పంద విలువే రూ.11 వేల కోట్లని, పెరిగిన అంచనా వ్యయాలు రూ.2వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొందరు ఎల్లంపల్లి వరకు చేపట్టిన పనులకే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారనడం వాస్తవం కాదన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే నీటి విడుదల చేస్తున్నారంటూ కొందరు మాట్లాడుతుండటం సరికాదన్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగా నీటిని విడుదల చేయ డం సర్వ సాధారణమన్నారు. గతంలో ఎస్సారెస్పీ ద్వారా ఏకంగా ఏడెనిమిది దశల్లో నీటి విడుదల జరిగిందని, నాగార్జున సాగర్, ఏఎంఆర్పీ ప్రాజెక్టులోనూ దశలవారీ నీటి విడుదల జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటి విడుదలతో శ్రీరాంసాగర్ రెండు దశల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కారు కేసులు వేయడం అర్థం చేసుకోవచ్చని, కానీ మన ప్రాంతం నాయకులే కేసులు వేయడం దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు మాత్రమే కాకుండా మున్ముందు దక్షిణ తెలంగాణకు కూడా వరప్రదాయిని, ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు. వైఎస్సార్, కేసీఆర్ ఇద్దరూ మహానుభావులే.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క పంట కోసం చేపట్టాలని సూచించారని, దానికి అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38వేల కోట్లుగా తేల్చారని, అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాత్రం రెండు పంటల కోసం రీడిజైన్ చేశారని, అందుకే వ్యయం రూ.80వేల కోట్లకు పెరిగిందని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వెంకట్రామారావు అన్నారు. వైఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్ చేస్తే ఇప్పుడు ఏకంగా స్థిరీకరణతో సహా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారని, కాబట్టి ఈ ప్రాజెక్టులో వైఎస్సార్, కేసీఆర్‌లు ఇద్దరూ భాగస్వామ్యులేనని తెలిపారు. గోదావరి జలాల వినియోగం విషయంలో వైఎస్సార్, కేసీఆర్ చూపిన చొరవ మరువరానిదని, ఇద్దరూ ఈ విషయంలో మహానుభావులేనని అన్నారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే వైఎస్ ఆత్మ ఆనంద పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వస్తే ఆయన హర్షం వ్యక్తం చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఏ ఒక్కరూ మాట్లాడవద్దని విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి కోరారు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు భారమంటూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ మాట్లాడటం ఆయన దుష్ట బుద్ధికి నిదర్శనమని రిటైర్డ్ ఇంజనీర్ భూమయ్య అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్లు కెప్టెన్ జనార్ధన్, సత్తిరెడ్డి, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరంతో కష్టాలెన్నో...
► డిజైన్ మార్పుతో శాశ్వత పెనుభారం... ► జేఏసీ అధ్యయనంలో వెల్లడి... నేడు నివేదిక విడుదల సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజె క్టును తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వద్ద మేడిగడ్డకు మార్చడంవల్ల తెలంగాణ ప్రజల పై శాశ్వతంగా పెనుభారం పడుతుందని తెలంగాణ జేఏసీ అధ్యయనంలో తేలింది. ప్రాజెక్టు ద్వారా ఎకరానికి అయ్యే వ్యయాన్ని సాగు నీటిపారుదల శాఖ నిపుణులు అధ్యయ నం చేశారు. తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మారుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే లాభనష్టాలపై నిపుణులు అధ్యయనం చేశారు.తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మారిస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుందని, నిర్వహణ వ్యయం శాశ్వతంగా భారం అవుతుందని తేలింది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు, ప్రతి పాదిత రిజర్వాయర్ల సామర్థ్యం, పంపుల సామర్థ్యం, నీటిలభ్యత, ఎత్తిపోతలకు అవకా శం ఉన్న రోజులు, సామర్థ్యం వంటివాటిపై సంపూర్ణంగా జరిపిన అధ్యయనంలో పలు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేస్తున్న వాదనలను అంకెలతో సహా కొట్టిపారేశారు. సాగునీటిపారుదల రంగ నిపుణులు గుజ్జా బిక్షం, శివకుమార్, విద్యుత్‌రంగ నిపుణులు కంచర్ల రఘు సంయుక్తంగా అధ్యయనం చేసి, నివేదికను రూపొందించారు. నీటి నిల్వకు అవకాశమే లేదు... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరానికి నీరందిం చడానికి ఏటా రూ.లక్ష నుంచి రూ.1.80 లక్షల దాకా ఖర్చు అవుతుందని తేలింది. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రతిపాదించిన మల్లన్నసాగర్లో నీటిని నిల్వచేసే అవకాశమే లేదని ఈ అధ్యయనంలో తేలింది. తప్పని విద్యుత్ భారం తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం వల్ల కొండపోచమ్మ రిజర్వాయర్ దాకా 525 మీటర్లు ఎత్తిపోసినా ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఉండవని తేల్చారు. దీనివల్ల ఏటా 1,250 కోట్ల విద్యుత్ భారం తప్పదని తేలింది. దీనివల్ల ప్రతీ ఎకరానికి 40 నుంచి 70 వేల ద్వారా కరెంటు చార్జీలే అదనంగా పడనున్నారుు. ఈ నివేదికను తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఆస్కి మాజీ డీన్ గౌతమ్ పింగ్లే విడుదల చేయనున్నారు. -
సాంకేతిక మార్పులతో రూ.20 వేల కోట్ల ఆదా!
ప్రాణహితపై మాజీ ఈఎన్సీ హనుమంతరావు సూచన నిర్మాణంలో పారదర్శకత అవసరం సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో కొన్ని సాంకేతిక విషయాలకు మెరుగులు దిద్ది తగిన మార్పులు చేస్తే దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయం తగ్గించడానికి వీలుకలుగుతుందని మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) టి.హనుమంతరావు సూచించారు. ప్రభుత్వం ప్రాజెక్టుల గురించి ఒక్కోసారి ఒక్కో విధమైన లెక్కలు చెబుతుండడంతో ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత లోపిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పాల కులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తనతో భేటీ సమయంలో మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్టుల నిర్మాణంలో మేలైన సాంకేతిక పద్ధతులు పాటించాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారని, అది హర్షణీయమన్నారు. తమ్మిడిహెట్టి వద్ద లభ్యం కానీ 160 టీఎంసీల నీటిని మేడిగడ్డ (గోదావరి మీద) బ్యారేజీ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర నీటి మట్టం మేడిగడ్డ నీటి మట్టంకంటే దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నారు. ఈ దృష్ట్యా లభ్యమయ్యే నీటినంతా తమ్మిడిహెట్టి దగ్గర తీసుకుని, తక్కువైన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలన్నారు. దీనివల్ల పంపింగ్ వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. మేడిగడ్డ, అన్నారం మధ్యలో గోదావరి మీద బ్యారేజీ కట్టినట్లయితే కాళేశ్వరం ఎగువన కట్టే పంపింగ్ స్కీమ్ అవసరం ఉండదన్నారు. మేడిగడ్డ వద్ద 120 రోజులు నీటి లభ్యత ఉన్న కారణంగా అక్కడ నీటి నిల్వ అవసరం లేదన్నారు. ఎల్లంపల్లి దిగువన కట్టబోయే నాలుగు బ్యారేజీలలో రివర్సబుల్ పంపులు పెట్టాలన్నారు. హనుమంతరావు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి సీపీఐ నేత పశ్య పద్మ మాట్లాడుతూ.. హనుమంతరావు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ వద్ద ప్రాజెక్టు లేకుండానే రైతాంగానికి నీరు అందించవచ్చన్న హనుమంతరావు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతం లో రైతులకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, బీజేపీ నేత రఘునందన్‌రావు, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ నేత చంద్రారెడ్డి, హైకోర్టు న్యాయవాది పి.విష్ణు పాల్గొన్నారు. నౌకాయానానికి పనికొచ్చేలా చూడాలి నౌకాయానానికి పనికొచ్చేలాగా ప్రతీ బ్యారేజీకి నౌక లాకును ఏర్పాటు చేసి, నది పొడవునా ఎక్కడా 4 మీటర్ల కంటే తక్కువ లోతు కాకుండా నీరుండేలా చూడాలని హనుమంతరావు సూచించారు. తెలంగాణలో ఉన్న 20 ఉపనదులను గొలుసుకట్టు బ్యారేజీల ద్వారా జీవనదులుగా మార్చుకోవచ్చన్నారు. -
భూ నిర్వాసితుల కోసం సీపీఎం పాదయాత్ర
వెల్దుర్తి: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దొంగచాటుగా భూమిని సేకరిస్తూ నిర్వాసితులను మోసం చేస్తోందని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేషం ఆరోపించారు. నిర్వాసితుల తరఫున ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం వెల్దుర్తి మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీ సర్కార్ మాత్రం 123 జీవో ప్రకారం భూములు సేకరించి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 20 న మెదక్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. -
'ఆ కాంట్రాక్టర్ల కోసమే రూ. 2 వేల కోట్లు'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌కు పేరు మార్చి రీడిజైన్ చేస్తామని చెప్పారు. పాత పేరుతోనే రూ. 2 వేల కోట్లు ఎందుకు రిలీజ్ చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ఆర్థిక సాయం చేసిన కాంట్రాక్టర్ల కోసమే ఈ రూ. 2 వేల కోట్లు అని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా ఈ ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 75 కోట్లు పెంచడం సమంజసం కాదని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. -
‘ప్రాణహిత’లో మరో 2 మినీ బ్యారేజీలు
ఎల్లంపల్లి-ఎస్సారెస్పీ మధ్య నిర్మించేలా సీఎం ప్రతిపాదన వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతల అప్పగింత హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నీటిని తరలించే క్రమంలో మూడు బ్యారేజీల నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం..తాజాగా ఎల్లంపల్లి-శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మధ్య మరో రెండు మినీ బ్యారేజీలను నిర్మించాలనే నిశ్చయానికి వచ్చింది. ప్రాణహితపై ఆదివారం సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మినీ బ్యారేజీల ప్రతిపాదనను తెచ్చి, వాటి నిర్మాణానికి అనువైన ప్రదేశాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గోదావరిపై వరుస బ్యారేజీల నిర్మించి.. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తేవాలని నిర్ణయించి, అందుకు తగ్గట్లు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ బ్యారేజీల నిర్మాణ పనులకు ఆదివారం సమీక్షలో సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇదే సందర్భంగా ఎల్లంపల్లి-ఎస్సారెస్పీ మధ్య అదనంగా మూడు బ్యారేజీల నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ఈ మార్గంలో ఇప్పటికే ఎస్సారెస్పీ దిగువన సదర్‌మఠ్ ప్రాంతం బ్యారేజీ నిర్మాణానికై ఇది వరకే నిర్ణయం జరగడం, దానికి సంబంధించి డీపీఆర్ సైతం సిద్ధమవుతున్న దృష్ట్యా కొత్తగా రెండు మినీ బ్యారేజీలు నిర్మించాలని సూచించారు. ఈ బ్యారేజీలను షట్టర్లతో నిర్మించాలని, వరద వచ్చినప్పుడు దిగువకు ప్రవాహాలు వెళ్లేలా, వరద తగ్గినప్పుడు షట్టర్లు మూసి 3 నుంచి 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక బ్యారేజీని ఎల్లంపల్లికి ఎగువన ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని జైనా వద్ద నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీని ఎగువన మరో బ్యారేజీ ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, వాటి సర్వే నివేదికలు తయారు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వ్యాప్కోస్‌కే కట్టబెట్టారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పింది
-
ఆ రెండు జిల్లాలపై కేసీఆర్ కక్ష కట్టారు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల రీజైన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రాజెక్టు మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ నరసింహన్‌కు రంగారెడ్డి జిల్లా అఖిలపక్షం నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై కొద్దిరోజులుగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐ నేతలు నేతలు గవర్నర్‌ను కలిశారు. భేటీ అనంతరం అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మార్పు వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని గవర్నర్ నరసింహన్‌కి వివరించామని వెల్లడించారు. ప్రాణహిత - చేవెళ్ల అంశంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తున్నామంటూ కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై కేసీఆర్ కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డికి తాగునీరు కోసం చేపట్టిన ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. ఇప్పుడు డిజైన్ మారిస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్ మార్పు వల్ల అంతర్ జిల్లాల మధ్య విబేధాలు తలెత్తి ప్రజాయుద్ధానికి దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్ మార్పుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని అఖిలపక్ష బృందం నేతలు హెచ్చరించారు. అఖిలపక్ష బృందంలో టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అంతుకు ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అఖిలపక్ష నేతలు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా గవర్నర్ వద్దకు వెళ్లారు. -
ఆత్మరక్షణలో టీఆర్ఎస్!
- ప్రాణ హిత డిజైన్ మార్పుతో ఇరుకునపడిన అధికారపార్టీ - సీఎం ప్రకటనతో ఆత్మరక్షణలో ప్రజాప్రతినిధులు - విపక్షాల దాడిని ఎదుర్కోలేక దాటవేత ధోరణి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుతో అధికార పార్టీ ఇరుకున పడింది. గోదావరి జలాలను మెదక్ జిల్లా వరకే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. డిజైన్ మార్పుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దాటవేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేస్తున్నారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నుం చి రంగారెడ్డి జిల్లాను ఎత్తివేయడంపై కాంగ్రెస్ నేతృత్వం లోని అఖిలపక్షం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రాజె క్టు పనులను పరిశీలించడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని ప్రభుత్వంపై దాడిచేసింది. అయితే, మొదట్నుంచీ రక్షణాత్మక వైఖరిని అవలంబించిన టీఆర్ఎస్.. సీఎం ప్రకటనతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. జెడ్పీ సమావేశాన్ని కాంగ్రెస్, టీడీపీ అడ్డుకున్న సమయంలో ఇంకా దీనిపై విధానపర నిర్ణయం తీసుకోలేదని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటిం చారు. అంతేకాకుండా ప్రాజెక్టు ఆయకట్టు నుంచి జిల్లా తొలగించకుండా వారం రోజుల్లో సీఎంను కలిసే ఏర్పా టు చేస్తానని హామీ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఖరా రు కాలేదు కానీ, ప్రాజెక్టును మెదక్ వరకే పరిమితం చేస్తున్నట్లు సీఎం విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో విపక్షాలన్నీ రాజకీయ పోరాటానికి పిలుపునిచ్చాయి. జిల్లా ప్రయోజనాలకు భంగం కలిగించేలా సర్కారు నిర్ణయం తీసుకుంటున్నా.. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు నోరుమెదపకపోవడంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. శని వారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యా దు చేయాలని నిర్ణయించాయి. ఒత్తిడి పెంచినా ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎవరికివారే.. ప్రాణహిత పనుల మళ్లింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతులె త్తేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు నిర్ణయాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమర్థించగా, మిగతా నేతలు ఈ అంశంపై నోరు విప్పేందుకు వెనుకాడుతున్నారు. జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చే ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి.. ఎలాంటి అనుమతుల్లేని కృష్ణా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామనే ప్రభుత్వ ప్రకటనను ప్రజలు విశ్వసించడంలేదని సాక్షాత్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అనధికారికంగా అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణహిత నమూనా మార్పుపై ప్రభుత్వ తీరును ప్రశ్నించలేక.. జిల్లా ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేక కప్పదాటు ధోరణి అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల కు సమాధానం ఇచ్చేందుకు మంత్రి మహేందర్‌రెడ్డే ఇష్టపడడం లేదు. మేమేందుకు దూకుడు ప్రదర్శించాలి’ అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ప్రశ్నించారు. డి జైన్ మార్పులేదని ఇన్నాళ్లు బుకాయించి.. ఇప్పుడు నిర్ణయం సరైందేనని వాదించడం కూడా మాకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నాం అని స్పష్టం చేశారు. -
గులాబీకి ‘ప్రాణ’ సంకటం!
- కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదేలా? - ప్రాణహిత -చేవెళ్లపై విపక్షపార్టీల విమర్శనాస్త్రాలు - డిజైన్ మార్పుపై అధికార పార్టీలో అస్పష్టత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పడేసింది. ఈ ప్రాజెక్టు కుదింపును రాజకీయాస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుండడంతో గులాబీ దళంలో గుబులు మొదలైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొలేక దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చే సిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటనను కాంగ్రెస్ అందిపుచ్చుకుంటోంది. పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలకు పదునుపెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తో డీలా పడ్డ ఆ పార్టీ నాయకత్వం.. తొలిసారి చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుపై సమష్టిగా పోరుబాట పట్టింది. ఓటమి తర్వాత దాదాపు ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాజె క్టు కుదింపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ప్రాజెక్టు నమూనా మారిస్తే సహించేదిలేదని హెచ్చరించడం ద్వారా రాష్ట్రస్థాయిలో చర్చకు తెరలేచింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనూ ఆ పార్టీ మునుపెన్నడులేని విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. డిజైన్ మార్చారా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఒకవైపు సమావేశంలో తీర్మానానికి పట్టుబట్టడం.. మరోవైపు బయట పార్టీ శ్రేణులు జెడ్పీని ముట్టడించడంతో కాంగ్రెస్ వ్యూహం ఫలించిం ది. ప్రాజెక్టుపై తీర్మానానికి ససేమిరా అన్న మంత్రి మహేందర్‌రెడ్డి.. విపక్ష సభ్యులను అరెస్ట్ చేయించారు. ఈ అంశం కూడా తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. అధికారపక్షంలో అస్పష్టత ప్రాణ హిత ప్రాజెక్టుపై అధికారపక్షం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ప్రాజెక్టు నమూనా మార్పుపై ఇప్పటికే పలుమార్లు సీఎం సంకేతాలిచ్చినప్పటికీ, ఈ అంశంపై నోరుమెదిపేందుకు అధికారపార్టీగణం జంకుతోంది. డిజైన్ మార్చారని ఒప్పుకుంటే జనంలోకి వెళ్లలేమని బయపడుతున్న ఆ పార్టీ.. డిజైన్ మార్చలేదని చెప్పేందుకూ సాహసించడంలేదు. గోదావరి జలాలు చేవెళ్ల వరకు రావని కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేసినందున.. ఏ ప్రకటన చేసినా గులాబీ బాస్‌తో చీవాట్లు తప్పవని భావిస్తోంది. ఈ ఇబ్బందే కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ‘తమ సభ్యులను బయటకు పంపాలా? సమావేశం వాయిదా వేయాలా? అనే అంశంపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న మహేందర్‌రెడ్డి.. ఒకవేళ ప్రాజెక్టు డిజైన్ మార్చకపోతే ఎందుకు అరెస్ట్ చేయిస్తారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. డిజైన్ మార్చుతున్నారు గనుకే కేటీఆర్ కూడా కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపించాలని సలహా ఇచ్చిఉంటారన్నారు. కాంగ్రెస్ ముప్పేట దాడిని కొనసాగించడంతో డైలమాలో పడిన గులాబీ దళం.. విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నాలు ప్రార ంభించింది. అయితే, ప్రాజెక్టు నమూనాపై స్పష్టత లేకుండా ముందుకెలా సాగాలనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. -
పోరుబాట
- ‘ప్రాణహిత- చేవెళ్ల’ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు - శంకర్పల్లి నుంచి పనుల ప్రాంతానికి పాదయాత్ర - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజా సంఘాలు - జవహర్‌నగర్‌లో నేడు పీసీసీ నేతల పర్యటన సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంకర్పల్లి: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చొద్దంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరుబాట విజయవంతంగా ముగిసింది. పార్టీలో విబేధాలు పక్కనపెట్టిన నేతలు ఐక్యంగా కలిసివచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శంకర్‌పల్లిలోని అతిథి గృహానికి మాజీ హోంమంత్రి సబితారెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్‌రెడ్డి, కోదండరాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కార్తీక్‌రెడ్డి తదితరులు చేరుకున్నారు. అక్కడ ప్రాజెక్టు పనులపై చర్చించిన తర్వాత.. అక్కడినుంచి పాదయాత్రగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి బయలుదేరారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం.. పక్కనే ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పించి పోరుబాటను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు ప్రజాసంఘాలు సైతం మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నాయి. ఉత్సాహంగా పార్టీ శ్రేణులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ.. మెల్లగా ప్రజల్లోకి వచ్చి ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగట్టేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు ప్రజల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసే దిశగా అగుడులు వేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం చేపట్టిన ప్రాణహిత -చేవెళ్ల పోరుబాట పార్టీ వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. కార్యక్రమంలో చేవెళ్లతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్ మండలాల నుంచి నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నాయకులంతా కలిసిమెలసి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించడంతో కార్యకర్తల్లో ఉత్సహం కనిపించింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ జంగారెడ్డి, శంకర్పల్లి ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ సభ్యుడు కళావతి, శంకర్పల్లి, శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, వేణుగౌడ్, శంషాబాద్ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్, నాయకులు నారాయణ, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంటలెండిపోతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి: టి.రామ్మెహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీంతో కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారని పరిగి శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం పరిగిలో ఒక వ్యవసాయ కుటుంబం బలవన్మరనానికి పాల్పడిందని, ఇలాంటి పరిస్థితులు అధిగమించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు చేపట్టారన్నారు. కానీ కొత్తరాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులో జిల్లాకు అవకాశం లేకుండా చేశారన్నారు. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకుంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలంతా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతారని మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరిం చారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, యువనేత పి.కార్తీక్‌రెడ్డి, నాయకులు ఎన్.శ్రీధర్, లక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ఉద్యమబాట ప్రభుత్వ భూముల్లో అక్రమాలపై ఉక్కపాదం మోపిన సర్కారు దూకుడును అడ్డుకునేందుకు పీసీసీ ఉద్యమబాట పట్టింది. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి సమీపంలోని కొమురంభీంనగర్లో గుడిసెలు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది నిర్వాసితులయ్యారు. తాజాగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆక్రమణలను తొలగించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సర్కారు ప్రయత్నాన్ని నిలువరించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చర్యలు చేపడుతోంది. శనివారం జవహర్‌నగర్‌లోని పేదలు ఏర్పాటు చేసుకున్న నివాసప్రాంతాల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నాయకులు పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు భయపడొద్దని, అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న సందేశాన్ని వారికి చేరవేసి వారిలో ధైర్యాన్ని నింపనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చితే సహించం
-
కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కుతుందనే కేసీఆర్ ఆందోళన
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదాల్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. అలాంటి ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ పనికిరాదనడం రాజకీయ దురుద్దేశమేనని గండ్ర వ్యాఖ్యానించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కుతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని గండ్ర అన్నారు. అందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కుట్రలు పన్నుతున్నారని, మహారాష్ట్ర సర్కార్ ప్రాణహిత చేవెళ్లకు గతంలోనే అంగీకరించిందని, ఇప్పుడక్కడ అధికారంలోకి వచ్చిన బీజేపీ వ్యతిరేకిస్తుందనడంతో కేసీఆర్ రాజీ పడుతున్నారని మండిపడ్డారు. తన కూతరు కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం బీజేపీతో కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారని గండ్ర ఆరోపించారు. -
రెట్టింపు ఇస్తేనే మా భూములిస్తాం
నర్సాపూర్‌రూరల్ (మెదక్): తాము పోగొట్టుకునే భూమికి రెట్టింపు భూమి ఇస్తేనే భూ సేకరణకు అంగీకరిస్తామని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్వాసిత రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ రైతులతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 18డీ ఈఈ దయానంద్, మధుకాన్ సంస్థ ప్రతినిధి సాంబశివరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి నుంచి వెల్దుర్తి మండల కేంద్రం పక్క నుంచి మహ్మదాబాద్‌కు సుమారు 40 కిలోమీటర్ల మేర కాలువకు కాలువ నిర్మాణ ప్రతిపాదనలు పూర్తి కాగా భూములను సేకరించాల్సి ఉందని తెలిపారు. అయితే, ఎకరంలోపు ఉన్న చిన్న రైతులే ఆ గ్రామాల్లో ఉన్నారని గ్రామస్తులు విన్నవించారు. ఆ భూములు కూడా పోతే తామంతా రోడ్డున పడుతామని చెప్పారు. అందుకే ప్రభుత్వం పది గుంటలు ఉన్న వారికి 20 గుంటలు, ఎకరా ఉన్న వారికి రెండెకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి కాలువను తవ్వుకోవచ్చని అధికారులకు స్పష్టం చేశారు. -
రూ.4,500 కోట్లు నీటిపాలు?
‘ప్రాణహిత’ డిజైన్ మార్పుతో ఇప్పటివరకైన వ్యయం వృథా? సర్వే నేపథ్యంలో పనులన్నీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం! తుమ్మిడిహెట్టి నుంచి మిడ్‌మానేరు వరకు ఇప్పటికే పూర్తై పనులు కాళేశ్వరం దిగువన ప్రాజెక్టు నిర్మిస్తే కొత్తగా కాలువలు, భూసేకరణ చేపట్టాలి.. విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం డిజైన్ మార్పుతో ఇబ్బంది తప్పదంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలన్న సర్కారు నిర్ణయం వివాదాస్పదం కానుందా? ప్రస్తుత స్వరూపాన్ని మారిస్తే వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులన్నీ వృథా అయినట్లేనా..? దీనికితో డు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయా? కేసీఆర్ ప్రకటించినట్లు ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం దిగువన చేపడితే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయా?.. ఈ ప్రశ్నలన్నింటికీ నీటి పారుదల రంగ నిపుణులు, అవుననే సమాధానమిస్తున్నారు. డిజైన్ మారిస్తే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పుకు సంబంధించి సమగ్ర సర్వే చేపట్టినందున.. పనులన్నింటినీ నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఘనమైన లక్ష్యం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2008లో అప్పటి సర్కారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని వినియోగించుకుని.. సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు మెజార్టీ ప్రజల దాహార్తిని తీర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ. 38,500 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తం ప్రాజెక్టు పనులను 7 లింక్‌లు, 28 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో లింక్-1 కింద ప్రాణహిత నది నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు 1 నుంచి 5 ప్యాకేజీలు ఉండగా... లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు రిజర్వాయర్ వరకు 6 నుంచి 8వ ప్యాకేజీ వరకు ఉన్నాయి. ఇందులో మొదటి 5 ప్యాకేజీల కింద కాలువల తవ్వకం, భూసేకరణ, ఇతర అవసరాలకు రూ. 6,385.24 కోట్లు, 6 నుంచి 8వ ప్యాకేజీ పనులకు రూ. 9,249.39 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ 8 ప్యాకేజీల్లో పనులకు ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం రూ. 4,489 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చేసిన పనులన్నీ వృథాయేనా? పాత డిజైన్ ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి 116 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి నీటిని తరలించి, అక్కడినుంచి మిడ్‌మానేరుకు మళ్లించాలి. కానీ కొత్త ప్రతిపాదనల మేరకు తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా... అక్కడికి 110 కిలోమీటర్ల దిగువన కాళేశ్వరం సమీపంలో మేటిగడ్డ వద్ద నుంచి నీటిని తరలించాలని భావిస్తున్నారు. అంటే దీనివల్ల తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత 152 మీటర్ల ఎత్తు బ్యారేజీని పరిగణనలోకి తీసుకుంటూ.. అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు జరిగిన కాలువల పనులన్నీ వృథా అయినట్లే. ఎందుకంటే కొత్త ప్రతిపాదన మేరకు కాళేశ్వరం నుంచి నీటిని తరలించాలని నిర్ణయిస్తే.. కొత్తగా కాలువల నిర్మాణం, భూమిని సేకరించాల్సి రావడం తప్పదు. అదే జరిగితే ఇప్పటివరకు జరిగిన రూ. 4 వేల కోట్ల విలువైన పనులు వృథా కానుండగా, కొత్త డిజైన్‌తో నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరింత విద్యుత్ అవసరం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుతో విద్యుత్ అవసరాల రూపేణా మరో సమస్య పొంచి ఉండనుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 142 మీటర్లతో పోలిస్తే... కాళేశ్వరం దిగువన ప్రతిపాదిస్తున్న ప్రాంతం వద్ద 50 మీటర్ల మేర ఎత్తు తక్కువగా ఉండటంతో... నీటిని 200 మీటర్లకు ఎత్తిపోయాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ అవసరం గణనీయంగా పెరుగుతుంది. ప్రాజెక్టుకు మొత్తంగా 3,159 మెగావాట్ల విద్యుత్ అవసరమని ఇదివరకు అంచనా వేయగా... డిజైన్ మారిస్తే మరో 400 మెగావాట్లు ఎక్కువగా అవసరమవుతుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే యూనిట్‌కు రూ. 5.75 మేర లెక్కించినా... ఏటా రూ. 3,800 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. అసలే విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఇంత విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తారని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ప్రశ్నలు వస్తున్న తరుణంలో... ఇప్పుడు మళ్లీ అదనపు విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలు.. ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే జలాలు.. 160 టీఎంసీలు ఏడు జిల్లాల్లోని 16.40 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వడం ప్రాజెక్టు మార్గాల్లోని గ్రామాలకు తాగునీటి కోసం 10 టీఎంసీలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సరఫరాకు 30 టీఎంసీలు 16 టీఎంసీల నీటిని పరిశ్రమలకు అందించడం ప్రాజెక్టు అంచనాలు.. పరిపాలనా ఆమోదం (17-12-2008).. రూ. 38,500 కోట్లు డీపీఆర్ ప్రకారం అంచనా.. రూ. 40,300 కోట్లు లిఫ్ట్‌ల(ఎత్తిపోతల) సంఖ్య.. 22 అవసరమైన విద్యుత్.. 3,159 మెగావాట్లు అవసరమైన మొత్తం భూమి.. 84,873 ఎకరాలు ఇందులో అటవీ భూమి.. 7,673 ఎకరాలు ఇప్పటివరకు జరిగిన వ్యయం.. (రూ. కోట్లలో) మొత్తం ఖర్చు 8,166.21 2014-15లో జరిగిన ఖర్చు 1,983.47 1 నుంచి 5వ ప్యాకేజీ వరకు అంచనా విలువ 6,385.24 ఇందులో ఇప్పటివరకు ఖర్చు 916 6 నుంచి 8 ప్యాకేజీ వరకు అంచనా 9,249.39 ఇందులో ఇప్పటికి వ్యయం 3,573 ప్రాజెక్టులోని ఇతర ప్యాకేజీల్లో ఖర్చు 3,677.21 పనులన్నీ నిలిపివేయండి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌పై కొత్తగా సమగ్ర సర్వే చేపట్టినందున ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పనులన్నింటినీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. ప్రాజెక్టు కొత్త స్వరూపానికి, ప్రస్తుత స్వరూపానికి తారతమ్యాలు ఉండడం, కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే పలు పనుల వ్యయం వృధా అయ్యే అవకాశమున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయానికే ప్యాకేజీ 1 నుంచి 8 వరకు పనులన్నీ నిలిచిపోయాయని, మిగతా పనులపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. -
అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు
తెలంగాణ శాసనసభను అర్థవంతంగా నడిపిస్తామని మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సచివాలయంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బోయనపల్లి కూరగాయల మార్కెట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్‌గా మారుస్తూ రూపొందించి దస్త్రంపై హరీష్ రావు తొలి సంతకం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
‘ప్రాణహిత-చేవెళ్ల’పై సర్కార్ నిర్లక్ష్యం
జలయజ్ఞంలో భాగంగా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర పోషించే భూసేకరణ విభాగం సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తం సిద్దిపేటలో 2012 జూన్‌లో మూడో యూనిట్ ఆఫీసును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలోని కరీంనగర్ రోడ్డుకు సమీపంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో దీనిని నెలకొల్పారు. ఈ ప్రాంతంలో అలైన్మెంట్ ప్రకారం భూమిని సేకరించడం ఈ కార్యాలయం ముఖ్యవిధి. అలాగే నిర్వాసితులైన భూ యజమానులకు డబ్బుల చెల్లింపుల వ్యవహారం కూడా ఈ కార్యాలయమే చూస్తుంది. ఇందుకు స్థానిక కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగాలి. క్షేత్రస్థాయిలో ఎంతో అవసరమైన ఇక్కడి భూసేకరణ యూనిట్పట్ల ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఈ కార్యాలయంలో ప్రస్తుతం మున్న పోస్టుల ఖాళీలే నిదర్శనం. ఖాళీల చిట్టా ఇది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు విభాగం-3లో ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లకుగాను ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ముగ్గురు ఆర్ఐలు ఉండాల్సి ఉంటే..ఒక్కరికే పరిమితం చేశారు. సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురికి గాను ఒక్కరూ లేరు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఐదుకు ఐదూ ఖాళీగానే ఉన్నాయి. నలుగురు సర్వేయర్లకు ఒక్కరూ లేరు. ఎనిమిది మంది చైన్మెన్లకు ఒక్క పోస్టయినా భర్తీ కాలేదు. ల్యాండ్ రికార్డు, డ్రాఫ్ట్‌మెన్ లేరు. ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. అందులోనూ ఇద్దరిని హైదరాబాద్ తార్నాక స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటేషన్ మీద పంపించారు. ప్రస్తుతం మిగిలిన ముగ్గురితోనే పని నడిపిస్తున్నారు. మూలిగే నక్కపై... అసలే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఈ కార్యాలయానికి అధిపతి అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) జి.నర్సింహులు గత జులై 31న రిటైరయ్యారు. సిద్దిపేటలో ఆఫీసు స్థాపనతోనే ఇక్కడికి వచ్చిన ఆయన ఏడాదిపాటు విధులు నిర్వర్తించారు. నర్సింహులు ఉద్యోగ విరమణ నేపథ్యంలో కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) ప్రత్యేక ఉప కలెక్టరు ఐలయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) ఇస్తూ తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల భూసేకరణ కార్యాలయలానికి బాసుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది కావాలి.