
ఆ రెండు జిల్లాలపై కేసీఆర్ కక్ష కట్టారు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల రీజైన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రాజెక్టు మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ నరసింహన్‌కు రంగారెడ్డి జిల్లా అఖిలపక్షం నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై కొద్దిరోజులుగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఐ నేతలు నేతలు గవర్నర్‌ను కలిశారు.
భేటీ అనంతరం అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మార్పు వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని గవర్నర్ నరసింహన్కి వివరించామని వెల్లడించారు. ప్రాణహిత - చేవెళ్ల అంశంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు.
ఈ ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తున్నామంటూ కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై కేసీఆర్ కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డికి తాగునీరు కోసం చేపట్టిన ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు.
ఇప్పుడు డిజైన్ మారిస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్ మార్పు వల్ల అంతర్ జిల్లాల మధ్య
విబేధాలు తలెత్తి ప్రజాయుద్ధానికి దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్ మార్పుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని అఖిలపక్ష బృందం నేతలు హెచ్చరించారు. అఖిలపక్ష బృందంలో టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అంతుకు ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అఖిలపక్ష నేతలు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా గవర్నర్ వద్దకు వెళ్లారు.