అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ. కోదండరాం. చిత్రంలో చాడ వెంకట్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. కరోనా కట్టడి, చికిత్సతోపాటు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. అలాగే, నవంబర్ దాకా పేదలకు నెలకు రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం, పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు, తొలగించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సీఎం సహాయనిధికి చేరిన నిధుల లెక్కలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై సీఎం కేసీఆర్ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హామీలివ్వకపోతే ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ప్రొ.కోదండరాం, శ్రీశైల్‌రెడ్డి (టీజేఎస్), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), ఎల్.రమణ (టీటీడీపీ), కె.గోవర్ధన్, వెంకట్రాములు (న్యూ డెమోక్రసీ), సీహెచ్.మురారి (ఎస్‌యూసీఐ–సీ) మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో ఉమ్మడి కార్యాచరణ చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఆగస్ట్ 7న అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చే హామీలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment