కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు  | Telangana Retired Engineers Trash Opposition Claims On Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు 

Published Wed, Jun 19 2019 10:27 AM | Last Updated on Wed, Jun 19 2019 10:49 AM

Telangana Retired Engineers Trash Opposition Claims On Kaleshwaram Project - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవపట్టించొద్దని రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం వివిధ రాజకీయ పక్షాలకు సూచించింది. ప్రాజెక్టు విషయంలో దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది. ప్రాజెక్టు పనులు కేవలం 15% మాత్రమే పూర్తయ్యాయని, అందుకు రూ.50వేల కోట్లు ఖర్చయ్యాయంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలు సరికాదని పేర్కొంది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 64% పూర్తవగా, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన నిర్మాణాల ఒప్పంద విలువే రూ.11 వేల కోట్లని, పెరిగిన అంచనా వ్యయాలు రూ.2వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొందరు ఎల్లంపల్లి వరకు చేపట్టిన పనులకే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారనడం వాస్తవం కాదన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే నీటి విడుదల చేస్తున్నారంటూ కొందరు మాట్లాడుతుండటం సరికాదన్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగా నీటిని విడుదల చేయ డం సర్వ సాధారణమన్నారు. గతంలో ఎస్సారెస్పీ ద్వారా ఏకంగా ఏడెనిమిది దశల్లో నీటి విడుదల జరిగిందని, నాగార్జున సాగర్, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులోనూ దశలవారీ నీటి విడుదల జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటి విడుదలతో శ్రీరాంసాగర్‌ రెండు దశల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కారు కేసులు వేయడం అర్థం చేసుకోవచ్చని, కానీ మన ప్రాంతం నాయకులే కేసులు వేయడం దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు మాత్రమే కాకుండా మున్ముందు దక్షిణ తెలంగాణకు కూడా వరప్రదాయిని, ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు.  

వైఎస్సార్, కేసీఆర్‌ ఇద్దరూ మహానుభావులే.. 
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్క పంట కోసం చేపట్టాలని సూచించారని, దానికి అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38వేల కోట్లుగా తేల్చారని, అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ మాత్రం రెండు పంటల కోసం రీడిజైన్‌ చేశారని, అందుకే వ్యయం రూ.80వేల కోట్లకు పెరిగిందని రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకట్రామారావు అన్నారు. వైఎస్‌ హయాంలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్‌ చేస్తే ఇప్పుడు ఏకంగా స్థిరీకరణతో సహా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్‌ చేశారని, కాబట్టి ఈ ప్రాజెక్టులో వైఎస్సార్, కేసీఆర్‌లు ఇద్దరూ భాగస్వామ్యులేనని తెలిపారు. గోదావరి జలాల వినియోగం విషయంలో వైఎస్సార్, కేసీఆర్‌ చూపిన చొరవ మరువరానిదని, ఇద్దరూ ఈ విషయంలో మహానుభావులేనని అన్నారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే వైఎస్‌ ఆత్మ ఆనంద పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వస్తే ఆయన హర్షం వ్యక్తం చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఏ ఒక్కరూ మాట్లాడవద్దని విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి కోరారు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు భారమంటూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ మాట్లాడటం ఆయన దుష్ట బుద్ధికి నిదర్శనమని రిటైర్డ్‌ ఇంజనీర్‌ భూమయ్య అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్‌ ఇంజనీర్లు కెప్టెన్‌ జనార్ధన్, సత్తిరెడ్డి, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement