Retired engineers
-
కాళేశ్వరం కమిషన్‌ను కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ అధికారులన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం శనివారం కలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్‌కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పడింది.సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించి పనిలోపడ్డ కాళేశ్వరం కమిషన్.. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యచరణను ప్రారంభించనుంది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవడానికి కమిషన్ కసరత్తు చేస్తోంది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే కమిషన్ మరోసారి అందరిని క్రాస్ ఎగ్జామినింగ్ చేయనుంది. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవపట్టించొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వివిధ రాజకీయ పక్షాలకు సూచించింది. ప్రాజెక్టు విషయంలో దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది. ప్రాజెక్టు పనులు కేవలం 15% మాత్రమే పూర్తయ్యాయని, అందుకు రూ.50వేల కోట్లు ఖర్చయ్యాయంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలు సరికాదని పేర్కొంది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 64% పూర్తవగా, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన నిర్మాణాల ఒప్పంద విలువే రూ.11 వేల కోట్లని, పెరిగిన అంచనా వ్యయాలు రూ.2వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొందరు ఎల్లంపల్లి వరకు చేపట్టిన పనులకే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారనడం వాస్తవం కాదన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే నీటి విడుదల చేస్తున్నారంటూ కొందరు మాట్లాడుతుండటం సరికాదన్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగా నీటిని విడుదల చేయ డం సర్వ సాధారణమన్నారు. గతంలో ఎస్సారెస్పీ ద్వారా ఏకంగా ఏడెనిమిది దశల్లో నీటి విడుదల జరిగిందని, నాగార్జున సాగర్, ఏఎంఆర్పీ ప్రాజెక్టులోనూ దశలవారీ నీటి విడుదల జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటి విడుదలతో శ్రీరాంసాగర్ రెండు దశల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కారు కేసులు వేయడం అర్థం చేసుకోవచ్చని, కానీ మన ప్రాంతం నాయకులే కేసులు వేయడం దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు మాత్రమే కాకుండా మున్ముందు దక్షిణ తెలంగాణకు కూడా వరప్రదాయిని, ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు. వైఎస్సార్, కేసీఆర్ ఇద్దరూ మహానుభావులే.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క పంట కోసం చేపట్టాలని సూచించారని, దానికి అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38వేల కోట్లుగా తేల్చారని, అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాత్రం రెండు పంటల కోసం రీడిజైన్ చేశారని, అందుకే వ్యయం రూ.80వేల కోట్లకు పెరిగిందని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వెంకట్రామారావు అన్నారు. వైఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్ చేస్తే ఇప్పుడు ఏకంగా స్థిరీకరణతో సహా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారని, కాబట్టి ఈ ప్రాజెక్టులో వైఎస్సార్, కేసీఆర్‌లు ఇద్దరూ భాగస్వామ్యులేనని తెలిపారు. గోదావరి జలాల వినియోగం విషయంలో వైఎస్సార్, కేసీఆర్ చూపిన చొరవ మరువరానిదని, ఇద్దరూ ఈ విషయంలో మహానుభావులేనని అన్నారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే వైఎస్ ఆత్మ ఆనంద పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వస్తే ఆయన హర్షం వ్యక్తం చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఏ ఒక్కరూ మాట్లాడవద్దని విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి కోరారు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు భారమంటూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ మాట్లాడటం ఆయన దుష్ట బుద్ధికి నిదర్శనమని రిటైర్డ్ ఇంజనీర్ భూమయ్య అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్లు కెప్టెన్ జనార్ధన్, సత్తిరెడ్డి, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం నుంచి నీటి సేకరణ పెంచాలి
రిటైర్డ్ ఇంజనీర్ల తీర్మానం సాక్షి, హైదరాబాద్: పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఫ్లోరైడ్ బాధిత మండలాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు శ్రీశైలం నుంచి 2.75 టీఎంసీలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్లు నిర్ణయించారు. శ్రీశైలం నుంచి తీసుకునే 2.75 టీఎంసీలలో 2 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు, మరో 0.75 టీఎంసీ డిండికి కేటాయించేలా చూడాలని తీర్మానించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయించారు. బుధవారం ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం, రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సంయుక్త భేటీ నిర్వహించింది. సమావేశంలో పాలమూరు, డిండి పరిధిలో నెలకొన్న వివాదాలపై చర్చించారు. సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్ర మౌళి, రాంరెడ్డి, రమేశ్‌రెడ్డి, డి.గోవర్ధన్‌రెడ్డి, ఎన్.రఘుమారెడ్డి పాల్గొన్నారు. -
నదులు, ఉపనదులపై వరుస బ్యారేజీలు
⇒ అప్పుడే గోదావరి నీటి సమర్థ వినియోగం ⇒ ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల సూచన సాక్షి, హైదరాబాద్: గోదావరి నీటి సమర్థ వినియోగానికి వీలుగా చిన్న చిన్న బ్యారేజీలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం తప్పనిసరని ప్రభుత్వానికి సాగునీటి రిటైర్డ్ ఇంజనీర్లు సూచించారు. నదులు, ఉపనదులు, వాగులపై వీలైనంత నీటిని నిల్వ చేసుకునే అంశాలపై కేంద్ర జల వనరులశాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సాగునీటి విధానాన్ని రూపొందించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ దొంతు లక్ష్మీనారాయణ, ఓయూ ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేశ్‌రెడ్డి, రిటైర్డ్ ఈఎన్సీ భాగ్యత రెడ్డి, రిటైర్డ్ సీఈ హన్మంత్‌రెడ్డి, సివిల్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల సమగ్ర విని యోగంపై శ్రీరాం రచించిన పుస్తకంలోని అంశాలను ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్వయించుకోవాలన్నారు. ప్రస్తుతమున్న నదులు, కాల్వలు, ఉపనదులు, నాలాలను నీటిని తరలించే వాహకాలుగా ఉపయో గించుకోవాలని, నదీ గర్భాలనే జలాశయాలుగా చేసుకోవాల న్నారు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ నీటిని ఎత్తిపోసే విధానాలకు ప్రాధాన్యత నివ్వా లని సూచించారు. గోదావరిపై కాళేశ్వరం వద్ద 115 మీ. వరకు నీటి మట్టం ఉండేలా ప్రాజెక్టు, వరుస బ్యారేజీలు నిర్మిస్తే జల రవాణా, సాగు, తాగు నీటి లభ్యత పెరుగు తుందని, పరిశ్రమల స్థాపనకు అవకాశం ఏర్పడడంతో పాటు నదుల అనుసంధానం సులువవుతుందన్నారు. -
‘కృష్ణా’తీర్పుపై రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు
అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రంపై ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న వారితో సమావేశంకానుంది. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? లేక ఇప్పటికే దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోనే పోరాటం చేయాలా? లేదా ట్రిబ్యునల్ ముందే పునర్విచారణ కోరాలా? అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల సలహా తీసుకోవాలని అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు నిర్ణయించారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సైతం ఈ నెల 14న మరోమారు భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే రోజు తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై అభిప్రాయాలివ్వండి
-రిటైర్డ్ ఇంజినీర్లను కోరిన మంత్రి హరీష్‌రావు హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రిటైర్డ్ ఇంజినీర్లకు నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఈ అంశమై రాష్ట్రానికి న్యాయం జరిగే రీతిలో కోర్టులు, ట్రిబ్యునల్ ముందు పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడి జల సౌధలో రిటైర్డ్ ఇంజినీర్లతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి రిటైర్డ్ ఇంజినీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, వెంకటరామారావుతో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా జలాల తీర్పు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ఇంజినీర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఉత్తమమని సూచనలు చేసినట్లుగా తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయాలు చెబుతూ నోట్ ఇస్తే దాన్ని సైతం పరిశీలనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. 29న అన్ని అంశాలపై చర్చిస్తామని, సుప్రీం సీనియర్న్యాయవాది వైద్యనాధన్ సూచనల మేరకు నడుచుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.