కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రంపై ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయించింది.
అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రంపై ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న వారితో సమావేశంకానుంది. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? లేక ఇప్పటికే దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోనే పోరాటం చేయాలా? లేదా ట్రిబ్యునల్ ముందే పునర్విచారణ కోరాలా? అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల సలహా తీసుకోవాలని అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు నిర్ణయించారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సైతం ఈ నెల 14న మరోమారు భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే రోజు తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.