ట్రిబ్యునల్ తీర్పుపై అభిప్రాయాలివ్వండి
-రిటైర్డ్ ఇంజినీర్లను కోరిన మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్:
కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రిటైర్డ్ ఇంజినీర్లకు నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఈ అంశమై రాష్ట్రానికి న్యాయం జరిగే రీతిలో కోర్టులు, ట్రిబ్యునల్ ముందు పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడి జల సౌధలో రిటైర్డ్ ఇంజినీర్లతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీకి రిటైర్డ్ ఇంజినీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, వెంకటరామారావుతో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా జలాల తీర్పు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ఇంజినీర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఉత్తమమని సూచనలు చేసినట్లుగా తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయాలు చెబుతూ నోట్ ఇస్తే దాన్ని సైతం పరిశీలనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. 29న అన్ని అంశాలపై చర్చిస్తామని, సుప్రీం సీనియర్‌న్యాయవాది వైద్యనాధన్ సూచనల మేరకు నడుచుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.